INDvsENG 4th Test: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... డ్రా దిశగా నాలుగో టెస్టు...

By Chinthakindhi RamuFirst Published Sep 6, 2021, 5:42 PM IST
Highlights

ఐదో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసిన ఇంగ్లాండ్... రోరీ బర్న్స్‌ను అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్, రనౌట్ అయిన డేవిడ్ మలాన్...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. 368 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఇంగ్లాండ్, ఐదో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీయగా, రనౌట్ రూపంలో మరో వికెట్ దక్కింది. 

తొలి వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఓపెనర్ రోరీ బర్న్స్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 125 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేసిన రోరీ బర్న్స్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... శార్దూల్ ఠాకూర్‌కి రెండో ఇన్నింగ్స్‌లో ఇదే తొలి ఓవర్ కావడం విశేషం. 

ఆ తర్వాత 33 బంతుల్లో 5 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. 120 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. రోరీ బర్న్స్ అవుటైన తర్వాత మరో ఓపెనర్ హసీబ్ హమీద్ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

123 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు అందుకున్నడు హమీద్ ఇచ్చిన క్యాచ్‌ను మహ్మద్ సిరాజ్ జారవిడిచాడు. దీంతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హసీబ్, 187 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 14 బంతుల్లో 8 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

లంచ్ బ్రేక్ సమయానికి ఇంకా 237 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్. టీమిండియా విజయాన్ని అందుకోవాలంటే ఇంకా 8 వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ ఆడుతున్నతీరు చూస్తుంటే, డ్రా కోసమే ప్రయత్నిస్తున్నట్టు ఉంది. అయితే లంచ్ బ్రేక్ తర్వాత గేర్ మార్చి ఆడితే, మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారే అవకాశం ఉంటుంది. 

click me!