INDvsENG 3rd test: భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్ జట్టు... తొలి రోజు వికెట్ కోల్పోకుండా...

By Chinthakindhi RamuFirst Published Aug 25, 2021, 11:12 PM IST
Highlights

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 42 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 120 పరుగులు చేసిన ఇంగ్లాండ్... టీమిండియాపై పదేళ్ల తర్వాత స్వదేశంలో తొలి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం...

మూడో టెస్టులో మొదటి రోజు పూర్తిగా ఇంగ్లాండ్ ఆధిపత్యం చూపించింది. అటు బౌలింగ్‌లో అదరగొట్టి, భారత జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 42 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 120 పరుగులు చేసింది. 

ఇప్పటికే భారత జట్టు కంటే 42 పరుగుల ఆధిక్యంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు. చేతిలో ఇంకా 10 వికెట్లు ఉండడంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కి భారీ ఆధిక్యం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో సెషన్‌లోనే టీమిండియాను ఆలౌట్ చేసి, బ్యాటింగ్‌కి వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు.

తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యాన్ని అందించిన రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, గత 26 ఇన్నింగ్స్‌ల్లో మొట్టమొదటి సారిగా మొదటి వికెట్‌కి సెంచరీ పార్టనర్‌షిప్ నెలకొల్పారు. ఇండియాపై 2011 తర్వాత మొదటి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నమోదుకావడం ఇదే తొలిసారి...

రోరీ బర్న్స్ 125 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేయగా, హసీబ్ హమీద్ 130 బంతుల్లో 11 ఫోర్లతో 60 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. తొలి రోజే ప్రత్యర్థికి ఆధిక్యం అందించడం టీమిండియాకి ఇది నాలుగోసారి... టీమిండియా బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయడానికి ముప్పుతిప్పలు పడిన చోట, ఇంగ్లాండ్ ఓపెనర్లు ఎంతో నిలకడగా కుదురుకుని, తేలిగ్గా బౌండరీలు సాధిస్తుండడం విశేషం.

click me!