ఫైనల్‌లో టాప్ లేపిన టాప్లీ... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఫ్లాప్ షో...

Published : Jul 17, 2022, 08:31 PM ISTUpdated : Jul 17, 2022, 10:06 PM IST
ఫైనల్‌లో టాప్ లేపిన టాప్లీ... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఫ్లాప్ షో...

సారాంశం

శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అవుట్ చేసిన రీస్ టాప్లీ... 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు... 

ఇంగ్లాండ్ టూర్‌ని సిరీస్ విజయంతో ముగించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. 260 పరుగుల లక్ష్యఛేదనలో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు... 

3 బంతుల్లో 1 పరుగు చేసిన శిఖర్ ధావన్, రీస్ టాప్లీ బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 17 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రీస్ టాప్లీ బౌలింగ్‌లోనే జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

22 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా టాప్లీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 8.1 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 38 పరుగులు మాత్రమే చేసింది భారత జట్టు...  5 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 15 పరుగులు మాత్రమే ఇచ్చిన రీస్ టాప్లీ 3 వికెట్లు తీసి భారత ‘టాప్’ లేపాడు... 

అంతకుముందు 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, 45.5 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌట్ అయ్యింది. గాయపడిన జస్ప్రిత్ బుమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్... తన మొదటి ఓవర్‌లో ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని షాక్ ఇచ్చాడు...

3 బంతులాడి పరుగులేమీ చేయలేకపోయిన జానీ బెయిర్‌స్టో, సిరాజ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌ ఆఖరి బంతికి జో రూట్ కూడా డకౌట్ అయ్యాడు. 3 బంతులాడిన జో రూట్, సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దశలో జాసన్ రాయ్, బెన్ స్టోక్స్ కలిసి మూడో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం అందించారు. 31 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసిన జాసన్ రాయ్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

29 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ కూడా హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లోనే అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దశలో మొయిన్ ఆలీ, జోస్ బట్లర్ కలిసి ఐదో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

44 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో జడేజా పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు క్రీజులో కుదురుకుపోయి హాఫ్ సెంచరీ చేసిన జోస్ బట్లర్ 80 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. లివింగ్‌స్టోన్‌ని అవుట్ చేసిన ఓవర్‌లోనే పాండ్యా బౌలింగ్‌లో జడేజాకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బట్లర్...

199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా డేవిడ్ విల్లే, క్రెగ్ ఓవర్టన్ కలిసి 8వ వికెట్‌కి 48 పరుగులు జోడించారు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన డేవిడ్ విల్లే, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

33 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన క్రెగ్ ఓవర్టన్, చాహాల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. ఆ తర్వాత రెండో బంతికి తోప్లేని చాహాల్ క్లీన్ బౌల్డ్ చేశాడు... 


భారత బౌలర్లలో యజ్వేంద్ర చాహాల్ 3 వికెట్లు తీయగా రవీంద్ర జడేజాకి ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 2 వికెట్లు తీయగా నాలుగు వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. 7 ఓవర్లలో 3 మెయిడిన్లతో 24 పరుగులు మాత్రమే ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, వన్డేల్లో మొట్టమొదటి సారి 4 వికెట్లు తీశాడు...

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు