
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అహ్మదాబాద్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో కదం తొక్కాడు. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ లో ఖవాజాదే తొలి శతకం. దీంతోపాటు ఖవాజా పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా ఖవాజా.. పన్నెండేండ్ల తర్వాత భారత్ పై సెంచరీ చేసిన ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ గా నిలిచాడు.
ఖవాజా కంటే ముందు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో 2010-11 సిరీస్ లో మార్కస్ నార్త్ సెంచరీ చేశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నార్త్ శతకం బాదాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్లు బీజీటీ కోసం 2012, 2016 లో కూడా రెండు సార్లు భారత్ కు వచ్చినా ఏ ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా సెంచరీ చేయలేదు.
ఇక 2010 - 11 సిరీస్ లో భాగంగా బెంగళూరు లో జరిగిన రెండో టెస్టులో మార్కస్ నార్త్.. తొలి ఇన్నింగ్స్ లో 128 పరుగులు చేశాడు. ఈ టెస్టులో సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున డబుల్ సెంచరీ చేయడం విశేషం. ఈ మ్యాచ్ ను భారత్ ఏడువికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇక ఈ సిరీస్ లో కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లు భారీ ఆశలతోనే భారత్ కు వచ్చారు. లబూషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, డేవిడ్ వార్నర్ లు భారీ ఆశలతో వచ్చినా వారిలో ఒక్కరు కూడా ఆ దిశగా అడుగులు వేయలేదు. మరీ ముఖ్యంగా స్టీవ్ స్మిత్ అయితే గడిచిన ఆరు ఇన్నింగ్స్ లలో ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు. అతడి కెరీర్ లో ఇలా ఆరు ఇన్నింగ్స్ లలో వరుసగా ఒక్క హాఫ్ సెంచరీ లేకపోవడం ఇదే ప్రథమం.
2017లో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్.. స్టీవ్ స్మిత్ తర్వాత సెంచరీ చేసిన తొలి క్రికెటర్ కూడా ఖవాజానే కావడం గమనార్హం. టెస్టులలో అతడికి ఇది 14వ సెంచరీ. పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పై మూడేసి సెంచరీలు బాదిన అతడికి భారత్ పై ఇదే తొలి శతకం. ఇక 2013 నుంచి భారత్ లో టెస్టులు ఆడుతూ రోజంతా క్రీజులో ఉండి సెంచరీ సాధించినవారిలో ఖవాజా రెండోవాడు. 2017లో ఢిల్లీ టెస్టులో శ్రీలంక బ్యాటర్ దినేశ్ చండీమాల్.. ఆట మూడో రోజు 25 పరుగులు ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి ఆ రోజు మొత్తం ఆడి 147 పరుగులు సాధించాడు.
అహ్మదాబాద్ టెస్టులో ఖవాజా.. ఓపెనర్ గా బరిలోకి దిగి ట్రావిస్ హెడ్ తో 61 పరుగులు జోడించాడు. అనంతరం స్టీవ్ స్మిత్ తో 79 పరుగులు జతచేశాడు. కామెరూన్ గ్రీన్ తో కూడా 85 పరుగులు జోడించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (104 నాటౌట్), కామోరూన్ గ్రీన్ (49 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు మరో స్పెషలిస్టు బ్యాటర్ కూడా క్రీజులో ఉండటంతో ఆస్ట్రేలియా 400 పై కన్నేసింది. ఆట రెండో రోజు ఉదయం ఈ ముగ్గురినీ వీలైనంత త్వరగా ఔట్ చేయకుంటే భారత్ కు ఈ టెస్టులో కష్టాలు తప్పవు.