
అహ్మదాబాద్ టెస్టులో మూడో రోజు ఉదయం ఆట ఆరంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు భారీ ఆశలు పెట్టుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ (58 బంతుల్లో 35, 3 ఫోర్లు, 1 సిక్స్) నిరాశపరిచాడు. 36 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. దూకుడుగానే ఆడింది. స్టార్క్ వేసిన 12 వఓవర్లో గిల్ చూడముచ్చటైన బౌండరీ సాధించాడు. అదే ఓవర్లో మరో ఫోర్ కూడా బాదాడు. ఈ ఓవర్లో భారత్ 14 పరుగులు సాధించింది.
స్టార్కే వేసిన 14వ ఓవర్లో రోహిత్.. ఓ ఫోర్, సిక్సర్ బాదాడు. క్రీజులో నెమ్మదిగా కుదురుకుంటున్నారనుకున్న తరుణంలో కున్హెమన్ ను స్మిత్ బరిలోకి దించాడు. అతడు 20వ ఓవర్లో ఆఖరి బంతికి హిట్ మ్యాన్ ను పెవిలియన్ కు పంపాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని డ్రైవ్ చేయబోయిన రోహిత్.. కవర్ పాయింట్ వద్ద ఉన్న లబూషేన్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది.
దిగ్గజాల సరసన రోహిత్ ..
ఈ మ్యాచ్ లో రోహిత్ 22 పరుగులు చేయగానే ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. 17 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కు వచ్చిన రోహిత్.. మరో ఐదు పరుగులు చేయగానే అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ తరఫున 17 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు. భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనిలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
భారత్ నుంచి అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసన వీరులు :
1. సచిన్ టెండూల్కర్ : 664 మ్యాచ్ లలో 34,357 పరుగులు
2. విరాట్ కోహ్లీ : 494 మ్యాచ్ లలో 25,047
3. రాహుల్ ద్రావిడ్ : 504 మ్యాచ్ లలో 24,064
4. సౌరవ్ గంగూలీ : 421 మ్యాచ్ లలో 18,433
5. ఎంఎస్ ధోని : 535 మ్యాచ్ లలో 17,092
6. రోహిత్ శర్మ : 438 మ్యాచ్ లలో 17,015
ఇక అహ్మదాబాద్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్.. 480 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. మూడో రోజు ఉదయం 25 ఓవర్ల ఆట ముగిసేసమయానికి భారత్.. ఒక వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (40 నాటౌట్), పుజారా (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు.