
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సారథి స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా, మూడో టెస్టులో గెలిచి సిరీస్‌లో 2-1 తేడాతో కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇండోర్ టెస్టు ఓడిన భారత జట్టు, సిరీస్‌ని సొంతం చేసుకోవాలన్నా, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి నేరుగా అర్హత సాధించాలన్నా ఆఖరి టెస్టు గెలవడం లేదా కనీసం డ్రా చేసుకోవడం తప్పని సరి. మరో వైపు మూడో టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా, చివరి టెస్టును కూడా గెలిచి సిరీస్‌ని సమం చేయాలని చూస్తోంది..
నేటి మ్యాచ్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఆసీస్ ప్రధానిని సత్కరించగా బీసీసీఐ సెక్రటరీ జై షా, భారత ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు...
భారత్, ఆస్ట్రేలియా మధ్య 75 ఏళ్ల స్నేహానికి చిహ్నంగా నేటి మ్యాచ్‌కి ప్రత్యేక గుర్తింపుని ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి టెస్టు క్యాప్ అందించగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, ఆసీస్ టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కి క్యాప్‌ని అందించాడు.
మొదటి మూడు టెస్టుల్లో ఆడిన మహ్మద్ సిరాజ్‌కి రెస్ట్ ఇచ్చిన టీమిండియా, మూడో టెస్టులో విశ్రాంతి తీసుకున్న మహ్మద్ షమీకి తిరిగి తుది జట్టులోకి తీసుకొచ్చింది. మొదటి మూడు టెస్టుల్లో ఫెయిల్ అయిన శ్రీకర్ భరత్ స్థానంలో ఇషాన్ కిషన్‌కి చోటు దక్కవచ్చని అభిప్రాయాలు వినిపించినా, మరోసారి ఈ తెలుగు కుర్రాడికి అవకాశం ఇచ్చింది భారత జట్టు..
విరాట్ కోహ్లీకి స్వదేశంలో ఇది 50వ టెస్టు మ్యాచ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌తోనే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభమై 75 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే అప్పుడు పట్టించుకోని బీసీసీఐ, అహ్మదాబాద్ టెస్టులో ఇరు దేశాల ప్రధానులతో ఈ వేడుకను నిర్వహించింది.. ఆసీస్ రెగ్యూలర్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనం కావడంతో నాలుగో టెస్టుకి కూడా స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్
ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, టాడ్ ముర్ఫీ, మాథ్యూ కుహ్నేమన్, నాథన్ లియాన్