INDvsAUS 3rd T20I: టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్ మెరుపులు... టీమిండియా ముందు భారీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Sep 25, 2022, 8:47 PM IST
Highlights

టీమిండియా ముందు 187 పరుగుల టార్గెట్ పెట్టిన ఆస్ట్రేలియా... మెరుపు  హాఫ్ సెంచరీలతో రాణించిన కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్...

టీ20 సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు తేలిపోయారు. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాకి 186/7 పరుగుల భారీ స్కోరు అందించారు. డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించిన జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియా అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకి మెరుపు ఆరంభం అందించాడు ఓపెనర్ కామెరూన్ గ్రీన్. మొదటి ఓవర్ నుంచి బౌండరీలతో విరుచుకుపడడంతో 3.2 ఓవర్లలో 44 పరుగులకు చేరుకుంది ఆస్ట్రేలియా స్కోరు. 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కామెరూన్ గ్రీన్ 21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ వివాదాస్పద రీతిలో రనౌట్ అయ్యాడు...

అక్షర్ పటేల్ వేసిన త్రో నేరుగా వికెట్లను తాకింది. అయితే అప్పటికే బంతిని అందుకునేందుకు ప్రయత్నించిన కీపర్ దినేశ్ కార్తీక్ చేతులను తాకి స్టంప్స్‌ కదిలాయి. అయితే అక్షర్ పటేల్ త్రో నేరుగా వికెట్లను తాకే సమయానికి గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్రీజు చేరుకోకపోవడంతో అతన్ని రనౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్...

22 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ కాగా మాథ్యూ వేడ్ కూడా అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 3 బంతుల్లో 1 పరుగు చేసిన మాథ్యూ వేడ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా...

17 ఓవర్లు ముగిసే సమయానికి 140 పరుగులే చేసింది ఆస్ట్రేలియా. అయితే భువీ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా 6,6,4 బాది 21 పరుగులు రాబట్టాడు టిమ్ డేవిడ్. ఆ తర్వాత బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో 6,1,6 (మిస్ ఫీల్డ్‌తో ఎక్స్‌ట్రాలు), 1,4 తో 18 పరుగులు రాబట్టారు డానియల్ సామ్స్, టిమ్ డేవిడ్.

హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికే సిక్సర్ బాదిన టిమ్ డేవిడ్, 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరుపున టిమ్ డేవిడ్‌కి ఇది మొట్టమొదటి హాఫ్ సెంచరీ. 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసిన టిమ్ డేవిడ్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో 1 పరుగు మాత్రమే వచ్చింది..

ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే ఇచ్చిన హర్షల్ పటేల్, ఆసీస్‌ స్కోరుని 190 దాటకుండా అడ్డుకోగలిగాడు. జస్ప్రిత్ బుమ్రా మొట్టమొదటి సారి టీ20ల్లో 50 పరుగులు సమర్పించుకోగా భువీ తాను వేసిన 3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చేశాడు...

click me!