
ఛత్రపతి మూవీలో ప్రభాస్ ‘ఒక్క అడుగు’ అన్నట్టుగా, ఢిల్లీ టెస్టులో భారత జట్టు, ఆస్ట్రేలియాకి ‘ఒక్క పరుగు’ లీడ్ ఇచ్చింది. టాపార్డర్ వైఫల్యంతో కనీసం 150 పరుగులైనా చేస్తారా అనుకున్న భారత జట్టును మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆదుకోవడంతో ఢిల్లీ టెస్టు రెండో రోజే ఆసక్తికరంగా మారింది... ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకి ఆలౌట్ కాగా టీమిండియా 262 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కి 1 పరుగు ఆధిక్యం దక్కింది.
139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, 200+ పరుగులు చేయడమే కష్టమని అనిపించింది. అయితే రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కలిసి ఏడో వికెట్‌కి 114 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి...భారత జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం కారణంగా టీమిండియా ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది..
ఓవర్‌నైట్ స్కోరు 21/0 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి నాథన్ లియాన్ ఊహించని షాక్ ఇచ్చాడు. 41 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన నాథన్ లియాన్, ఆ తర్వాత వెంటవెంటనే 3 వికెట్లు తీశాడు..
69 బంతుల్లో 2 ఫోర్లతో 32 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికి పూజారా వికెట్ కోల్పోయింది భారత జట్టు. 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా, 7 బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
15 బంతుల్లో 4 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోంబ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 46/0 స్కోరుతో ఉన్న టీమిండియా, వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయి 66/4 స్థితికి చేరుకుంది..
ఈ దశలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 74 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 84 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేసి మాథ్యూ కుహ్నేమాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..
టీవీ రిప్లైలో బంతి విరాట్ కోహ్లీ బ్యాటుకి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో వివాదం రేగింది. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది టీమిండియా.
ఈ దశలో స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కలిసి ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో రంషో పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. దీంతో 114 పరుగుల 8వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది...
115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసిన అక్షర్ పటేల్, టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్ గాల్లోకి ఎగురుతూ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. 2 పరుగులు చేసిన షమీని కుహ్నేమన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 262 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది.