
వన్డే వరల్డ్ కప్ 2022 ఆరంభానికి ముందు కావాల్సిన ఊరట విజయాన్ని అందుకుంది భారత మహిళా జట్టు. ఏకైక టీ20తో మొదలైన కివీస్ పర్యటనలో భారత జట్టు వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడింది. వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అద్భుత విజయాన్ని అందుకుని, ద్వైపాక్షిక సిరీస్‌ను ముగించింది... తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళా జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. కివీస్ కెప్టన్ సోఫియా డివైన్ 41 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేయగా అమెలియా కేర్ 75 బంతుల్లో 6 ఫోర్లతో 66 పరుగులు చేసి అవుట్ అయ్యింది...
సూజీ బేట్స్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేయగా సథర్త్‌వైట్ 21 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు, లారెన్ డౌన్ 37 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసింది. జెన్సెన్ 33 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తి శర్మ , స్నేహ్ రాణా రెండేసి వికెట్లు తీయగా పూనమ్ యాదవ్, మేఘనా సింగ్ చెరో వికెట్ తీశారు...
252 పరుగుల లక్ష్యఛేదనలో భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. భారత సెన్సేషనల్ ఓపెనర్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేయగా స్మృతి మంధాన 84 బంతుల్లో 9 ఫోర్లతో 71 పరుగులు చేసి అదరగొట్టింది...
వన్డేల్లో ఛేదనలో స్మృతి మంధానాకి గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఇది ఏడో 50+ స్కోరు కావడం విశేషం. ఓ మ్యాచ్‌లో 49 పరుగుల వద్ద అవుటై హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది ఇండియన్ వుమెన్ ఛేజ్ మాస్టర్. దీప్తి శర్మ, స్మృతి మంధాన కలిసి రెండో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
41 బంతుల్లో ఓ ఫోర్‌తో 21 పరుగులు చేసిన దీప్తి శర్మ అవుటైన తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కలిసి మూడో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు. జట్టు స్కోరు 153 పరుగుల వద్ద స్మృతి మంధాన అవుటైనా హర్మన్ ప్రీత్ కౌర్, కెప్టెన్ మిథాలీ రాజ్ కలిసి నాలుగో వికెట్‌కి 72 పరుగులు జోడించి భారత జట్టును విజయ తీరాలకు చేర్చారు...
కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేక, గాయాలతో సతమతమవుతూ జట్టుకి దూరమవుతూ వస్తున్న ఇండియన్ టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 66 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 పరుగులు చేసి అవుటైంది...
ఆ తర్వాత కెప్టెన్ మిథాలీరాజ్ 66 బంతుల్లో 6 ఫోర్లతో 57 పరుగులు, వికెట్ కీపర్ రిచా ఘోష్ 7 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించారు. 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్న భారత జట్టు, న్యూజిలాండ్‌లోనే మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాల్గొనబోతోంది.