చదరంగ ప్రపంచంలో చిచ్చరపిడుగులా దూసుకుపోతున్నాడు భారత టీనేజ్ సంచలనం ప్రజ్ఞానంద. వరల్డ్ నెం.1, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్లెసన్‌ని రెండోసారి ఓడించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్.
చెస్బుల్ మాస్టర్స్ ఆన్‌లైన్ రాపిడ్ చెస్ టోర్నీలో భాగంగా ఐదో రౌండ్‌లో మాగ్నస్ కార్లెసన్‌తో తలబడిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద... వరల్డ్ నెం.1ని చెక్ మేట్ చేసి... సంచలనం క్రియేట్ చేశాడు. ఫిబ్రవరి 2022లో జరిగిన ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ టోర్నీల్లో 39 ఎత్తుల్లో మాగ్నస్ కార్లెసన్‌ని ఓడించిన ప్రజ్ఞానంద, ఈసారి 41 ఎత్తుల్లో వరల్డ్ నెం.1ని చిత్తు చేశాడు...
40వ ఎత్తు వరకూ ఇద్దరూ ఆచితూచి ఆడడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్నట్టు కనిపించింది. అయితే 40వ ఎత్తుగడ సమయంలో వరల్డ్ నెంబర్ 1 మాగ్నస్ కార్లెసన్ చేసిన ఓ పెద్ద పొరపాటును సరిగ్గా వాడుకున్న రమేశ్‌బాబు ప్రజ్ఞానంద... చెక్ మేక్ చేసి 12 పాయింట్లు సాధించాడు. ఈ విజయంతో మాగ్నస్ కార్లెసన్ తర్వాతి స్థానానికి ఎగబాకాడు రమేశ్‌బాబు ప్రజ్ఞానంద..
అప్పటి విజయం తర్వాత వరల్డ్ నెం.1 చెస్ ప్లేయర్‌ను ఓడించిన ప్రజ్ఞానందను ట్వీట్ ద్వారా అభినందించాడు భారత మాజీ క్రికెటర్, ‘భారతరత్న’ సచిన్ టెండూల్కర్. 16 ఏళ్ల వయసులో వరల్డ్ నెం.1ని ఓడించడం, అదీ బ్లాక్స్‌తో ఆడుతూ గెలవడం ఓ మ్యాజికల్ విన్ అంటూ ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్, ఇండియాను గర్వించేలా చేసినందుకు అభినందించాడు..
నాలుగేళ్ల క్రితం 2018లో 12 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత లెజెండరీ చెస్ ప్లేయర్ విశ్వనాథ్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు రమేశ్‌బాబు ప్రజ్ఞానంద. విశ్వనాథన్ ఆనంద్‌కి 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సొంతం కాగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బ్రేక్ చేసేశాడు...
తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద, ఓవరాల్‌గా ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఐదో చెస్ ప్లేయర్. 2013లో అండర్ 8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన ప్రజ్ఞానంద, ఏడేళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించాడు...
10 ఏళ్ల 10 నెలల 19 రోజుల వయసులో ఇంటర్నేషనల్ మాస్టర్‌గా నిలిచిన ప్రజ్ఞానంద, తన వయసు కంటే రెట్టింపు అనుభవం ఉన్న చందరంగ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తూ విశ్వ వేదికపై దూసుకుపోతున్నాడు...
రమేశ్‌బాబు ప్రజ్ఞానంద అక్క వైశాలి రమేశ్‌బాబు కూడా చెస్ ప్లేయరే. అండర్ 12, అండర్ 14 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన వైశాలి రమేశ్‌బాబు, 2016లో వుమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించింది...