మురళీధరన్ రికార్డుపై కన్నేసిన అశ్విన్... విండీస్ లోనే లాంఛనం పూర్తయ్యేనా..?

By Arun Kumar PFirst Published Aug 29, 2019, 3:40 PM IST
Highlights

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. టెస్టుల్లో ముత్తయ్య మురళీధరన్ పేరిట వున్న రికార్డుపై అశ్విన్ మరో అడుగు దూరంలో నిలిచాడు.  

వెస్టిండిస్ గడ్డపై 11 టెస్ట్ మ్యాచుల్లో 60 వికెట్లు.  ఈ గణాంకాలు చాలు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విండీస్ జట్టుపై ఎలా చెలరేగుతాడో చెప్పడానికి. కానీ అలాంటి క్రికెటర్ కు కూడా ఇటీవల కరీబియన్ జట్టుతో జరిగిన మొదటి టెస్ట్ లో చోటు దక్కలేదు. దీంతో టీమిండియా మేనేజ్ మెంట్ పై సౌరవ్ గంగూలీ, వీరేంద్ర  సెహ్వాగ్ వంటి సీనియర్లు విరుచుకుపడ్డారు. ఈ టెస్ట్ లో టీమిండియా గెలిచింది కాబట్టి ఈ నిర్ణయం మరీ ఎక్కువగా విమర్శలపాలవ్వలేదు. ఒకవేళ కోహ్లీసేన ఓటమిపాలైతే మాత్రం అశ్విన్ ను పక్కనబెట్టడంపై అందరికీ సమాధానం  చెప్పాల్సి వచ్చేది. 

మాజీల విమర్శలు, విండీస్ పై మెరుగైన రికార్డును దృష్ట్యా రెండో టెస్ట్ లో అశ్విన్ కు తుదిజట్టులో చోటుదక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఓ అరుదైన రికార్డును అశ్విన్ బద్దలుగొట్టే అవకాశాలున్నాయి. టెస్టుల్లో అత్యంత వేగంగా 350వికెట్లను పడగొట్టిన రికార్డుకు అశ్విన్ కేవలం అడుగు దూరంలో నిలిచాడు. 

శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ప్రస్తుతం ఫాస్టెస్ట్ 350 వికెట్స్ రికార్డు నమోదై వుంది. అతడు కేవలం 66 టెస్ట్ మ్యాచుల్లోనే ఈ మైలురాయికి చేరుకున్నాడు. అయితే అశ్విన్ కూడా ఇప్పటివరకు 65 టెస్టుల్లో 342 వికెట్లు పడగొట్టాడు. తదుపరి మ్యాచ్ లో అతడు మరో ఎనిమిది వికెట్లు పడగొడితే మురళీధన్ సరసన చేరనున్నాడు. అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొడితే మాత్రం మురళీధరన్ ను అదిగమించి కొత్త రికార్డును నెలకొల్పనున్నాడు. 

విండీస్ పై మంచి ట్రాక్ రికార్డుంది కాబట్టి అశ్విస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లోనే ఈ ఘనత సాధించవచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అశ్విన్ విజృంభిస్తే టీమిండియా టెస్ట్ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా అతడి ఖాతాలోకి కూడా ఫాస్టెస్ట్ వికెట్ టేకింగ్ రికార్డు చేరుతుంది. 
 

click me!