
కరోనా లాక్‌డౌన్ తర్వాత మొదటిసారిగా టీమిండియా షెడ్యూల్‌కి నెల రోజులకు పైగా గ్యాప్ వచ్చింది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత నెల రోజుల పాటు హాలీడేస్ ఎంజాయ్ చేసిన భారత జట్టు, జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది..
అయితే వెస్టిండీస్ టూర్‌లో మ్యాచులు చూడాలంటే టీమిండియా ఫ్యాన్స్ నిద్ర మానుకొని, జాగారం చేయక తప్పదు. డొమెనికాలో జూలై 12న ఉదయం 10 గంటలకు ఇండియా, వెస్టిండీస్ మధ్య మొదటి టెస్టు ప్రారంభం అవుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఆట మొదలవుతుంది.
సాయంత్రం 7:30 నుంచి 9:30 వరకూ తొలి సెషన్ జరుగుతుంది. ఆ తర్వాత 40 నిమిషాల లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత రాత్రి 10 గంటల 10 నిమిషాలకు రెండో సెషన్ మొదలవుతుంది. అర్ధరాత్రి 12:10 నిమిషాలకు రెండో సెషన్ ముగిసిన తర్వాత 20 నిమిషాల టీ బ్రేక్ ఉంటుంది.
టీ బ్రేక్ తర్వాత అర్ధరాత్రి 12:30కి మొదలయ్యే ఆట, 2 గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది. అటూ ఇటూగా టెస్టు మ్యాచ్‌ల మజాని పూర్తిగా ఆస్వాదించాలంటే టీమిండియా ఫ్యాన్స్, నిద్రను మానుకుని జాగారం చేయాల్సి ఉంటుంది..
స్టార్ స్పోర్ట్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం, మార్చి 2023 నెలలో ముగియడంతో వెస్టిండీస్‌తో సిరీస్‌ని జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు. అలాగే ఫ్యాన్ కోడ్ యూట్యూబ్ ఛానెల్‌లో, వెబ్‌సైట్‌లో కూడా మ్యాచ్ ప్రత్యేక్ష ప్రసారం అవుతుంది.
టీవీలో చూడాలంటే దూరదర్శన్ స్పోర్ట్స్ (డీడీ స్పోర్ట్స్) ఛానెల్ మాత్రమే ఇండియా- వెస్టిండీస్ టెస్టు సిరీస్ మ్యాచులను ప్రసారం చేస్తోంది. ఇది కేవలం కేబుల్ నెట్‌వర్క్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండడంతో డీటీహెచ్ ద్వారా టీవీ వీక్షించేవారికి లైవ్ మ్యాచులు చూసే అవకాశం లేదు..
ఈ టెస్టు సిరీస్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, అజింకా రహానే వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి సీనియర్లతో పాటు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్ వంటి కొత్త ప్లేయర్లకు కూడా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం కల్పించారు సెలక్టర్లు..
తొలి టెస్టు ద్వారా యశస్వి జైస్వాల్, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో జోస్ బట్లర్‌ని కూడా డామినేట్ చేస్తూ బ్యాటింగ్ చేసిన ఈ చిచ్చర పిడుగు, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ శుబ్‌మన్ గిల్‌ని ఓపెనర్‌గా కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే, యశస్వి జైస్వాల్.. వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా ప్లేస్‌లో బ్యాటింగ్‌కి రావచ్చు..
తొలి టెస్టుకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసి హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్, స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.