మాకు తెలుసు: హెట్ మెయిర్ ను ఆకాశానికెత్తిన పోలార్డ్

By telugu teamFirst Published Dec 16, 2019, 12:20 PM IST
Highlights

టీమిండియా బౌలర్లను ఉతికి ఆరేసి సెంచరీతో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హెట్ మెయిర్ మీద కెప్టెన్ కీరోన్ పోలార్డ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని శక్తి ఏమిటో తమకు తెలుసునని అన్నాడు.

చెన్నై: చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచులో భారత్ పై వెస్టిండీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించి 139 పరుగులు చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షిమ్రోన్ హెట్ మెయిర్ మీద వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 

హెట్ మెయిర్ విధ్వంసకరమైన ఆటగాడని, తనదైన రోజున చెలరేగిపోయి మ్యాచును ప్రత్యర్థి చేతుల్లోంచి లాగేసుకుంటాడని పోలార్డ్ అన్నాడు. హెట్ మెయిర్ లో విశేషమైన ప్రతిభ ఉందని తమకు తెలుసునని, కానీ గత 9 నెలలుగా బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్నాడని ఆయన అన్నాడు.

Also Read: రవీంద్ర జడేజా ఔట్ ఎఫెక్ట్: అంపైర్ పై విరాట్ కోహ్లీ ఆగ్రహం

హెట్ మెయిర్ కు తమ జట్టులో ఉన్న పాత్ర ఏమిటో తెలుసునని, అందుకే అతనిపై తాము నమ్మకం ఉంచామని పోలార్డ్ అన్నాడు. గత 18 నెలల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లో పలు తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలు కూడా హెట్ మెయిర్ చూశాడని, చాలా కాలం తర్వాత హెట్ మెయిర్ నుంచి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ రావడంతో టీమ్ మేనేజ్ మెంట్ ఆనందంగా ఉందని ఆయన అన్నాడు. 

ప్రతి ఒక్కరూ రాణించడం వల్లనే తాము ఇండియాపై ఈ మ్యాచులో విజయం సాధించామని అన్నాడు. తమ ప్రధాన బౌలింగ్ ఆయుధం కాట్రెల్ అని, అతను ఎంతో పరిణతి చెందాడని, తమ జట్టులో చాలా టాలెంట్ ఉందని, ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని పోలార్డ్ అన్నాడు. 

Also Read: వెస్టిండీస్ వర్సెస్ ఇండియా: సెంచరీ కొట్టి హెట్ మెయిర్ రికార్డు

భారత్ తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తమ ముందు ఉంచిన 188 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హెట్ మెయిర్  తో పాటు హోప్ కూడా సెంచరీ చేశాడు.

click me!