21 పరుగులకే 3 వికెట్లు... భారీ లక్ష్యఛేదనలో టాపార్డర్ ఢమాల్! పీకల్లోతు కష్టాల్లో టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Jan 5, 2023, 9:15 PM IST
Highlights

21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా... తీవ్రంగా నిరాశపరిచిన ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్.. 

బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు హార్ధిక్ పాండ్యా. పరిస్థితులను చక్కగా వాడుకున్న లంక జట్టు 206 పరుగుల భారీ స్కోరు చేయగా 207 పరుగుల కొండంత లక్ష్యఛేదనలో 21 పరుగులకే 3  వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా.  2  పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌‌ని క్లీన్ బౌల్డ్ చేసిన రజిత, టీమిండియాకి తొలి షాక్ ఇచ్చాడు.

5 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా రజిత బౌలింగ్‌లోనే అవుట్ కాగా మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న రాహుల్ త్రిపాఠి 5 పరుగులు చేసి దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి 27 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక, నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగుల భారీ స్కోరు చేసింది. లంక ఓపెనర్ కుశాల్ మెండీస్, భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది...

తొలి ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే రాగా అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో ఏకంగా 19 పరుగులు వచ్చేశాయి. వరుసగా మూడు నో బాల్స్ వేసిన అర్ష్‌దీప్ సింగ్, రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ సమర్పించాడు. రెండో ఓవర్‌లో వచ్చిన ఊపును ఆ తర్వాతి ఓవర్లలో కొనసాగించాడు కుశాల్ మెండీస్...

మూడో ఓవర్‌లో 11, నాలుగో ఓవర్‌లో 15 పరుగులు రాబట్టాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది శ్రీలంక. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న కుశాల్ మెండీస్‌ని యజ్వేంద్ర చాహాల్ అవుట్ చేశాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు మెండీస్..

2 పరుగులు చేసిన రాజపక్షను ఉమ్రాన్ మాలిక్ క్లీన్ బౌల్డ్ చేయగా 35 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన నిశ్శంక, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ధనంజయ డి సిల్వ 3 పరుగులు చేసి అవుట్ కాగా చాహాల్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు బాది 16 పరుగులు రాబట్టాడు అసలంక.. 19 బంతుల్లో 4 సిక్సర్లతో 37 పరుగులు చేసిన చరిత్ అసలంక, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఆ తర్వాతి బంతికే వానిందు హసరంగని క్లీన్ బౌల్డ్ చేశాడు ఉమ్రాన్ మాలిక్. మొదటి 3 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ధసున్ శనక రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 21 పరుగులు రాబట్టాడు..

అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌లో 18 పరుగులు రాబట్టిన శనక, ఆఖరి ఓవర్‌లో 3 సిక్సర్లు బాది 20 పరుగులు రాబట్టాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేసిన శనకతో పాటు కరుణరత్నే 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

నేటి మ్యాచ్‌లో ఏకంగా 5 నో బాల్స్ వేశాడు అర్ష్‌దీప్ సింగ్. ఓ భారత బౌలర్‌ టీ20ల్లో ఇన్ని నో బాల్స్ వేయడం ఇదే తొలిసారి. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్‌కి 2 వికెట్లు దక్కాయి. యజ్వేంద్ర చాహాల్ ఓ వికెట్ తీశాడు. 

click me!