టీ20 వరల్డ్ కప్ 2022: పాకిస్తాన్‌పై బౌలర్లు సూపర్ సక్సెస్... ఇక బ్యాటర్లపైనే భారం...

By Chinthakindhi Ramu  |  First Published Oct 23, 2022, 3:23 PM IST

India vs pakistan: 3 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్... హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్...


టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఫాస్ట్ బౌలింగ్ విభాగంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేసేసింది టీమిండియా. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యంగ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు సీనియర్లు హార్ధిక్ పాండ్యా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌ ఇచ్చారు. అయితే పాక్ బ్యాటర్లు ఇఫ్తికర్ అహ్మద్, షాన్ మసూద్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది పాకిస్తాన్... 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌కి శుభారంభం దక్కలేదు. భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే చేయగలిగింది. అది కూడా వైడ్ రూపంలో వచ్చింది.. రెండో ఓవర్‌లో మొదటి బంతికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు అర్ష్‌దీప్ సింగ్. 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. అదే ఓవర్ ఐదో బంతికి షాన్ మసూద్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆఖరి బంతికి ఫోర్ బాదిన మహ్మద్ రిజ్వాన్, స్కోరు బోర్డులో కదలిక తెచ్చాడు...

Latest Videos

టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన పాక్ కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు బాబర్ ఆజమ్. బాబర్ ఆజమ్‌కి ఇది ఐదో డకౌట్ కాగా షాహీన్ ఆఫ్రిదీ 4 సార్లు డకౌట్ అయ్యాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్ కూడా అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భువీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

15 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది పాకిస్తాన్. విరాట్ కోహ్లీ డైరెక్ట్ త్రో మిస్ చేయడంతో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న షాన్ మసూద్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చాడు. అయితే అశ్విన్ క్యాచ్ అందుకునే ముందు బంతి నేలను తాకినట్టు టీవీ రిప్లైలో కనిపించడంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు మసూద్...

10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది పాకిస్తాన్. అశ్విన్ వేసిన 11 వ ఓవర్‌లో సిక్సర్ బాదిన ఇఫ్తికర్  10 పరుగులు రాబట్టగా అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్‌లో 3 సిక్సర్లతో 21 పరుగులు రాబట్టాడు ఇఫ్తికర్ అహ్మద్...

మూడో వికెట్‌కి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇఫ్తికర్ అహ్మద్, 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన షాదబ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

అదే ఓవర్ 4 బంతుల్లో 2 పరుగులు చేసిన హైదర్ ఆలీ కూడా హార్ధిక్ పాండ్యా ఓవర్‌లో ఆఖరి బంతికి సూర్యకుమార్ యాదవ్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 91/2 వద్ద ఉన్న పాకిస్తాన్ స్కోరు, 10 బంతుల వ్యవధిలో 98/5కి చేరుకుంది...

హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన మహ్మద్ నవాజ్, 9 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లలో 30 పరుగులిచ్చిన హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు...

3 బంతుల్లో 2 పరుగులు చేసిన అసిఫ్ ఆలీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 19వ ఓవర్‌లో వరుసగా ఓ ఫోర్, ఓ సిక్సర్ బాదిన షాహీన్ ఆఫ్రిదీ, పాక్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 8 బంతుల్లో 16 పరుగులు చేసిన షాహీన్ ఆఫ్రిదీ, భువీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

వస్తూనే హరీస్ రౌఫ్ సిక్సర్ బాదగా షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

 

click me!