టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వరుసగా మూడో విజయం అందుకున్న శ్రీలంక... ఐర్లాండ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం..
ఆసియా కప్ 2022 విజేతగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అడుగుపెట్టిన శ్రీలంక, సూపర్ 12 రౌండ్‌ని విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన లంకకి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వరుసగా ఇది మూడో విజయం...
129 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించిన శ్రీలంక, 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. 25 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వ, డెలనీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 63 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది శ్రీలంక. అయితే ఓపెనర్ కుశాల్ మెండిస్,చరిత్ అసలంక కలిసి మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు. కుశాల్ మెండిస్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేయగా చరిత్ అసలంక 22 బంతుల్లో 2 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 70 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేయగా కెప్టెనన్ బాల్బీరిన్ 5 బంతుల్లో 1 పరుగు చేసి లహీరు కుమార బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
టక్కర్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేయగా హారీ టెక్టర్ 42 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేశాడు. కుర్టీస్ కాంపర్ 2 పరుగులు చేయగా కరోనా బారిన పడిన జార్జ్ డాక్రెల్ 16 బంతుల్లో 14 పరుగులు చేసి మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
డెలానీ 9, సిమీ సింగ్ 7, బారీ మెక్‌కార్తీ 2 పరుగులు చేయగా మార్క్ అడైర్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మహీశ్ తీక్షణకు రెండు వికెట్లు దక్కాగా ఫెర్నాండో, లహిరు కుమార, కరుణరత్నే, ధనంజయ డి సిల్వలకు తలా ఓ వికెట్ దక్కింది. ఈ సిరీస్‌లో 9 వికెట్లు తీసిన శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు.