Ind Vs Nz: ఆరంభంలో అదుర్స్.. ఆఖర్లో సీన్ రివర్స్.. ఊరించి ఉసూరుమనిపిస్తున్న కివీస్

By team teluguFirst Published Nov 20, 2021, 10:01 AM IST
Highlights

India Vs New Zealand T20I: ప్రపంచకప్ కోల్పోయి భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి.  టీమిండియాతో జరుగుతున్న మూడు టీ20 ల సిరీస్ ను కూడా ఆ జట్టు కోల్పోయింది. అసలు లోపం ఎక్కడుంది..? 

భారత  పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ వరుసగా రెండు టీ20లలోనూ ఓడిపోయి పరాజయం పాలైంది. జైపూర్ లో జరిగిన తొలి మ్యాచ్ లో గెలుపు కోసం పోరాడిన కివీస్ కు.. నిన్నటి మ్యాచ్ లో అయితే  ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ల వీర విహారంతో ఆ ప్రయత్నం కూడా చేసే అవకాశమే రాలేదు. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన కివీస్.. ఇన్నింగ్స్ ను భాగానే ఆరంభిస్తున్నా ఆఖర్లో తడబడుతున్నది.  రెండు మ్యాచుల్లో ఈ లోపం ఆ జట్టును భారీ స్కోరు చేయకుండా నిలువరించింది. భారీ హిట్టర్లున్నా.. ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టే  ఆటగాళ్లున్నా చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు తేలిపోతుంది.  జైపూర్ తో పాటు  రాంచీ లో కూడా కివీస్ ఆ లోపాన్ని పూడ్చుకోలేదు. 

జైపూర్ లో జరిగిన తొలి టీ20లో ఓపెనర్ మిచెల్ అవుటైనా మరో ఓపెనర్ గప్తిల్, వన్ డౌన్ బ్యాటర్ మార్క్ చాప్మన్ లు ఇరగదీశారు. ఆ మ్యాచ్ లో తొలి పవర్ ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 41-1గా ఉంది. 13 ఓవర్లకే 106-1 చేరింది.  క్రీజులో చాప్మన్, గప్తిల్ ఇరగదీస్తున్నారు. దీంతో ఆ జట్టు భారీ స్కోరు ఖాయమనుకున్నారంతా. 17 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయినా 144 పరుగులు  చేసింది. హిట్టర్లు ఉండటంతో కనీసం 170 పైనే అవుతుందని అభిమానులు భావించారు. కానీ ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆ జట్టు 164 పరుగులే చేయగలిగింది. కీలకమైన ఆఖరు మూడు ఓవర్లలో ఆ జట్టు చేసింది 20 పరుగులే. 

 

A terrific bowling performance on debut 💪 wins the Man of the Match award for his splendid spell of 2/25 👏👏 pic.twitter.com/BvRz4qmL5Z

— BCCI (@BCCI)

ఇక నిన్నటి మ్యాచ్ లో కూడా అదే కథ. ఆరంభంలో మిచెల్, గప్తిల్ చెలరేగి ఆడారు. 2 ఓవర్లకే స్కోరు 24-0.. తొలి పవర్ ప్లే ముగిసేసరికి 6 ఓవర్లలో 64-1.. 13 ఓవర్లకే స్కోరు వంద పరుగులు దాటింది. దీంతో ఈ మ్యాచ్ లో  180 పరుగుల టార్గెట్ పక్కా అనుకున్నారంతా. కానీ మళ్లీ సీన్ రివర్స్. 17ఓవర్లు ముగిసేసరికి 138 పరుగులు చేసిన కివీస్.. ఆఖరు మూడు ఓవర్లలో 15 పరుగులే చేసింది. ఫలితంగా 153 పరుగులకే పరిమితమైంది. 

కివీస్ వరుసగా ఇలా విఫలమవుతున్న చోట టీమిండియా బౌలర్లు మాత్రం ఇరగదీస్తున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో భారీగా పరుగులిస్తున్నా డెత్ ఓవర్లలో మాత్రం బాగా కట్టడి చేస్తున్నారు.ముఖ్యంగా డెత్ ఓవర్ స్పెషలిస్టుగా పేరున్న భువనేశ్వర్.. దీపక్ చాహర్ లతో పాటు నిన్నటి మ్యాచ్ లో అరంగ్రేటం చేసిన హర్షల్ పటేల్ సైతం  కట్టుదిట్టంగా బంతులేస్తూ  పరుగుల వరదకు అడ్డుకట్ట వేస్తుండటం గమనార్హం. ఇది భారత బౌలింగ్ కు శుభపరిణామమే. ఇన్నింగ్స్ మధ్యలో పరుగుల వరదకు స్పిన్నర్లు అడ్డుకట్ట వేస్తుండగా.. డెత్ ఓవర్లో స్లో బంతులతో పాటు వైవిధ్యమైన బౌలింగ్ తో పేసర్లు అదరగొడుతున్నారు. మరి  ఇదే జోరు వచ్చే ప్రపంచకప్ దాకా కొనసాగిస్తారో లేదో చూడాల్సి ఉంది.

click me!