రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ అవుట్! రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా... వరల్డ్ రికార్డు బ్రేక్ చేసి..

By Chinthakindhi Ramu  |  First Published Oct 22, 2023, 7:28 PM IST

అత్యంత వేగంగా 2 వేల వన్డే పరుగులు అందుకున్న బ్యాటర్‌గా శుబ్‌మన్ గిల్ రికార్డు.. 46 పరుగులు చేసి రోహిత్ శర్మ, 26 పరుగులు చేసి శుబ్‌మన్ గిల్ అవుట్.. 


న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 274 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం అందించారు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో ఫోర్ బాదిన రోహిత్ శర్మ, హ్యాట్ హెన్రీ ఓవర్‌లో వరుసగా 6, 4 బాదాడు..

ఈ సిక్సర్‌తో 2023లో 50 వన్డే సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. క్రిస్ గేల్ 2019లో 56 సిక్సర్లు, ఏబీ డివిల్లియర్స్ 2015లో 58 సిక్సర్లు బాది... రోహిత్ కంటే ముందున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, ఈ రికార్డును బ్రేక్ చేయొచ్చు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో మరో సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, వన్డే వరల్డ్ కప్‌లో 37 సిక్సర్లు బాదిన ఏబీ డివిల్లియర్స్‌ని దాటేశాడు. 49 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ మాత్రమే, రోహిత్ శర్మ కంటే ముందున్నాడు..

Latest Videos

undefined

ఏడో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన శుబ్‌మన్ గిల్, వన్డేల్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు శుబ్‌మన్ గిల్. శుబ్‌మన్ గిల్‌ 38 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల వన్డే పరుగులు అందుకుంటే, ఇంతకుముందు హషీమ్ ఆమ్లా 40, జహీర్ అబ్బాస్ 45 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు అందుకున్నారు..

అతి పిన్న వయసులో 2 వేల వన్డే పరుగులు అందుకున్న ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. సచిన్ టెండూల్కర్ 20 ఏళ్ల 354 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉంటే యువరాజ్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. శుబ్‌మన్ గిల్ 24 ఏళ్ల 44 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించాడు..

40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసిన రోహిత్ శర్మ, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 71 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.. 31 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా ఫర్గూసన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. భారీ షాట్‌కి ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్, బౌండరీ లైన్ దగ్గర డార్ల్ మిచెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 76 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.. 

click me!