శ్రేయాస్ అయ్యర్ సెంచరీ మిస్, సుందర్ మెరుపులు... తొలి వన్డేలో భారీ స్కోరు చేసిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Nov 25, 2022, 10:44 AM IST
Highlights

India vs New Zealand 1st ODI: 80 పరుగులు చేసి అవుటైన శ్రేయాస్ అయ్యర్... 77 పరుగులు చేసిన శిఖర్ ధావన్, 50 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... 

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 76 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా కెప్టెన్ శిఖర్ ధావన్ 72 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించి, భారత జట్టుకి భారీ స్కోరు అందించాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకి ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, భారత జట్టుకి మంచి ఫ్లాట్‌ఫాం అందించారు. 65 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో డివాన్ కాన్వేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  

టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 4 ఓవర్లు ముగిసే సమయానికి 12 పరుగులే చేసిన భారత జట్టు,  10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది..

లూకీ ఫర్గూసన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు బాది 14 పరుగులు రాబట్టాడు శిఖర్ ధావన్. ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో ఫోర్ బాదిన ధావన్, 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌లో ఐదో బంతికి ఫోర్ బాది, భారత జట్టు స్కోరు 100 పరుగులు దాటించాడు గబ్బర్...

మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన శుబ్‌మన్ గిల్, 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. 23 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసింది భారత జట్టు.. 24వ ఓవర్ మొదటి బంతికి శుబ్‌మన్ గిల్, భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...  

ఆ తర్వాతి ఓవర్‌లోనే శిఖర్ ధావన్ కూడా అవుట్ అయ్యాడు. 77 బంతుల్లో 13 ఫోర్లతో 72 పరుగులు చేసిన శిఖర్ ధావన్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.  

శుబ్‌మన్ గిల్- శిఖర్ ధావన్ మధ్య ఇది నాలుగో సెంచరీ భాగస్వామ్యం. 9 ఇన్నింగ్స్‌ల్లో నాలుగుసార్లు 100కి పైగా భాగస్వామ్యం జోడించారు గిల్- గబ్బర్. ధావన్ అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పరుగులు రావడమే కష్టమైపోయింది. 

మూడో వికెట్‌కి 8 ఓవర్లలో 32 పరుగులు జోడించిన తర్వాత రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన రిషబ్ పంత్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 156 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు. క్రీజులోకి వస్తూనే ఫోర్ బాదిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత రెండో బంతికి పెవిలియన్ చేరాడు. 

ఫర్గూసన్ బౌలింగ్‌లో సూర్య బ్యాటు ఎడ్జ్‌ని తాకుతూ వళ్లిన బంతి, స్లిప్‌లో ఫిన్ ఆలెన్ చేతుల్లో పడింది. కివీస్‌పై రెండో టీ20లో సెంచరీ చేసిన సూర్య, తొలి వన్డేలో మూడు బంతులు మాత్రమే ఆడి పెవిలియన్ చేరాడు... ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ కలిసి ఐదో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 

38 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఆఖరి ఓవర్ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ మెరుపు బ్యాటింగ్ చేయగా శార్దూల్ ఠాకూర్ 2 బంతుల్లో 1 పరుగు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 

 

click me!