శుబ్‌మన్ గిల్ అవుట్... శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, తొలి వన్డేలో టీమిండియాకి శుభారంభం...

By Chinthakindhi RamuFirst Published Nov 25, 2022, 8:40 AM IST
Highlights

తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్... హాఫ్ సెంచరీ చేసి అవుటైన శుబ్‌మన్ గిల్... 

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకి శుభారంభం దక్కింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. 65 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో డివాన్ కాన్వేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  

తొలి ఓవర్‌లో టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఫోర్ బాదిన శిఖర్ ధావన్, మూడో ఓవర్‌లోనూ బౌండరీ రాబట్టాడు. మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో వైడ్ రూపంలో ఒకే ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. నాలుగో ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్‌గా మలిచాడు హెన్నీ. దీంతో 4 ఓవర్లు ముగిసే సమయానికి 12 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా.. 

7 బంతుల తర్వాత తొలి పరుగు చేసిన శుబ్‌మన్ గిల్, మ్యాట్ హెన్నీ వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు. అక్కడి నుంచి స్కోరు బోర్డులో కదలిక మొదలైంది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లోనే గిల్ మరో సిక్సర్ బాదగా, 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది భారత జట్టు..

లూకీ ఫర్గూసన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు బాది 14 పరుగులు రాబట్టాడు శిఖర్ ధావన్. ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో ఫోర్ బాదిన ధావన్, 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌లో ఐదో బంతికి ఫోర్ బాది, భారత జట్టు స్కోరు 100 పరుగులు దాటించాడు గబ్బర్...

మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన శుబ్‌మన్ గిల్, 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. 23 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసింది భారత జట్టు.. 24వ ఓవర్ మొదటి బంతికి శుబ్‌మన్ గిల్, భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...  

ఆ తర్వాతి ఓవర్‌లోనే శిఖర్ ధావన్ కూడా అవుట్ అయ్యాడు. 77 బంతుల్లో 13 ఫోర్లతో 72 పరుగులు చేసిన శిఖర్ ధావన్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.  

శుబ్‌మన్ గిల్- శిఖర్ ధావన్ మధ్య ఇది నాలుగో సెంచరీ భాగస్వామ్యం. 9 ఇన్నింగ్స్‌ల్లో నాలుగుసార్లు 100కి పైగా భాగస్వామ్యం జోడించారు గిల్- గబ్బర్. శుబ్‌మన్ గిల్‌కి ఇది నాలుగో హాఫ్ సెంచరీ. మొత్తంగా 10 ఇన్నింగ్స్‌ల్లో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు శుబ్‌మన్ గిల్...

ఓవరాల్‌గా మొదటి 13 వన్డే ఇన్నింగ్స్‌లు ముగిసిన తర్వాత 629 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ 13 వన్డే ఇన్నింగ్స్‌ల తర్వాత 558 పరుగులు చేసి టాప్‌లో ఉండేవాడు. శిఖర్ ధావన్ 536, శ్రేయాస్ అయ్యర్ 531 పరుగులు చేసి సిద్ధూ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

click me!