ఇంగ్లాండ్‌తో కీలకమైన టెస్ట్ సిరీస్‌కు సంబంధించి టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు దూరంగా వుంటున్నట్లు ప్రకటించాడు. విరాట్ గైర్హాజరి టీమిండియాకు పెద్ద దెబ్బేనని చెప్పాలి.
ఇంగ్లాండ్‌తో కీలకమైన టెస్ట్ సిరీస్‌కు సంబంధించి టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు దూరంగా వుంటున్నట్లు ప్రకటించాడు. విరాట్ గైర్హాజరి టీమిండియాకు పెద్ద దెబ్బేనని చెప్పాలి. భీకర ఫాంలో వుండటం, ఇంగ్లాండ్‌పై మంచి ట్రాక్ రికార్డు వున్న కోహ్లీ ప్లేసులో ఎవరిని భర్తీ చేయాలనే దానిపై జట్టు మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో నలుగురు ఆటగాళ్ల పేర్లు తెర మీదకు వస్తున్నాయి.
లిస్ట్ ఫస్ట్ పేరు ఛతేశ్వర్ పుజారాదే. టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరుండటంతో పాటు మంచి టెక్నిక్ పుజారా సొంతం. చివరిగా గతేడాది టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పాల్గొన్న పుజారా.. ప్రస్తుతం ఫాంలో లేకపోవడంతో సెలక్టర్లు పక్కనపెట్టారు. కాకపోతే రంజీల్లో ఆయన మంచి ఫాంలో వున్నాడు. ఇటీవల జరిగిన తొలి మ్యాచ్‌లో జార్ఖండ్‌పై 243 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత వరుసగా 49, 43, 43, 66 పరుగుల చొప్పున సాధించాడు. అంతేకాదు.. ప్రస్తుత తరంలో 100 టెస్టులు పూర్తి చేసిన ఆటగాడు కావడం పుజారాకు కలిసొచ్చే అంశం.
పుజారాను పక్కనబెడితే.. ముగ్గురు యువ ఆటగాళ్లలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని కూడా సెలక్టర్లు భావిస్తున్నారట. వారే రజిత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, సాయి సుదర్శన్. మధ్యప్రదేశ్‌కు చెందిన రజీత్ ప్రస్తుతం భీకర ఫాంలో వున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు తరపున 151 పరుగులు చేశాడు. అలాగే వార్మప్ మ్యాచ్‌లోనూ 111 స్కోరు చేశాడు. రజత్ 55 ఫస్ట్ క్లాస్ టెస్టుల్లో 45.97 సగటుతో 4000 పరుగులు పూర్తి చేశాడు. 2021-22 రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబైపై సెంచరీ సాధించి మధ్యప్రదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక సర్ఫరాజ్ విషయానికి వస్తే.. 2020 నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 82.46 పరుగుల సగటు సాధించాడు. స్పిన్ పిచ్‌లపై అద్భుతంగా ఆడగల నైపుణ్యం అతని సొంతం. తాజాగా ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన తొలి అనధికార టెస్టులో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్‌లోనూ 96 పరుగులు చేశాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేకపోవడం, నిలకడ లేమి అతనికి ప్రతికూలంగా మారాయి.
తమిళనాడుకు చెందిన సాయి సుదర్శణ్ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా జట్టులోకి అరంగేట్రం చేశాడు. 2022-23 రంజీ ట్రోఫీలో 572 పరుగులు చేశాడు. భారత్ ఏ తరపున కూడా అద్భుత ప్రదర్శన చేయగా.. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ట్రాక్ రికార్డు పరంగా ఈ నలుగురూ బాగానే వుండటంతో వీరిలో సెలక్టర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.