
టీమిండియా జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన 199 పరుగుల భారీ స్కోరు చేసి, 50 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ఇంగ్లాండ్ జట్టు 148 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మరోసారి టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయబోతుండడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది..
కెప్టెన్‌గా రోహిత్ శర్మకు గత మ్యాచ్‌లో వరుసగా 13వ విజయం దక్కింది... వరుసగా 13 టీ20ల్లో గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచిన రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో గెలిస్తే విరాట్ కోహ్లీ తర్వాత ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్ గెలిచిన రెండో భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు...
ఐదో టెస్టు జరిగిన ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టీ20లో భారత సీనియర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ కూడా పాల్గొనబోతున్నారు. మొదటి టీ20లో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వెంకటేశ్ అయ్యర్... మిగిలిన రెండు టీ20ల్లో ఆడడం లేదు...
ఓ రకంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడబోయే ప్రధాన ఆటగాళ్లంతా నేటి మ్యాచ్‌లో బరిలో దిగబోతున్నారు. ఒక్క కెఎల్ రాహుల్ మాత్రమే గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఆసియా కప్ 2022 సమయానికి కెఎల్ రాహుల్ కోలుకుంటాడని భావిస్తోంది టీమిండియా...
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రెండు మ్యాచుల ప్రదర్శన కీలకం కానుంది. కొన్నాళ్లుగా టీ20ల్లో పేలవ ప్రదర్శన ఇస్తున్న విరాట్ కోహ్లీ, ఈ రెండు టీ20ల్లో రాణించకపోతే అతన్ని పొట్టి ఫార్మాట్ నుంచి తప్పించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి...
టీ20 వరల్డ్ కప్ 2022,ఆసియా కప్ 2022 టోర్నీలకు ముందు విరాట్ కోహ్లీ టీ20ల్లో చోటు కోల్పోతే... ఆ రెండు మెగా టోర్నీల్లో అతనికి చోటు ఉంటుందా? అనేది అనుమానంగా మారింది. ఇంగ్లాండ్‌తో జరిగిన గత నాలుగు టీ20ల్లో మూడు సార్లు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు విరాట్ కోహ్లీ... ఈ మూడుసార్లు కూడా నాటౌట్‌గా నిలిచి, మ్యాచ్‌ని ముగించాడు...
నేటి మ్యాచ్ ద్వారా 34 ఏళ్ల పేసర్ రిచర్డ్ గ్లీసన్, ఇంగ్లాండ్ తరుపున టీ20 ఆరంగ్రేటం చేస్తున్నాడు. గత మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని, సిరీస్ సమం చేయాలని చూస్తోంది ఇంగ్లాండ్...
భారత జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్
ఇంగ్లాండ్ జట్టు: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్ హారీ బ్రూక్, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్సన్