బంగ్లాదేశ్‌లో పొలిటికల్ టెన్షన్... ఇండియా వర్సెస్ బంగ్లా వన్డే సిరీస్‌ వేదిక మార్పు...

By Chinthakindhi RamuFirst Published Nov 24, 2022, 4:19 PM IST
Highlights

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వేడెక్కిన రాజకీయం... ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉండడంతో మూడో వన్డేని చిట్టగాంగ్‌కి మార్చిన బంగ్లా క్రికెట్ బోర్డు...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగించుకున్న టీమిండియా, వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతోంది. టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వన్డే సిరీస్ జరగనుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా బంగ్లాదేశ్‌ టూర్‌కి బయలుదేరుతుంది భారత జట్టు...

న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి సీనియర్లు అందరూ బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లో పాల్గొనబోతున్నారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 జరగనున్న నేపథ్యంలో బంగ్లాతో జరిగే వన్డే సిరీస్... ప్రపంచకప్‌కి తుది జట్టుని ఖరారుచేసేందుకు మొదటి ప్రయోగంగా చూస్తోంది బీసీసీఐ...

ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో  వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పొలిటికల్ టెన్షన్ నెలకొనడంతో వేదిక మారుస్తూ నిర్ణయం తీసుకుంది బీసీబీ. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) వచ్చే నెలలో ఢాకాలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. దీంతో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వేదికలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)...

2015 తర్వాత ఏడేళ్లకు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది భారత జట్టు. అందుకే భారత జట్టుకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు  షెడ్యూల్‌లో చిన్న మార్పులు చేసింది బంగ్లా క్రికెట్ బోర్డు.. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4 ఆదివారం రోజున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మొదటి వన్డే , డిసెంబర్ 7న రెండో వన్డే జరుగుతాయి. అదే వేదికల డిసెంబర్ 10న జరగాల్సిన మూడో వన్డే మాత్రం ఢాకా నుంచి చిట్టగాంగ్‌కి  మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు...

‘షెడ్యూల్ ప్రకారం చిట్టగాంగ్‌లో మొదటి టెస్టు మాత్రమే జరగాల్సింది. అయితే ఆఖరి వన్డే కూడా అక్కడే పెడితే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నాం. ’ అంటూ కామెంట్ చేశాడు బీసీబీ ఆపరేషన్స్ ఛీఫ్ జలాల్ యూనిస్.  

వన్డే సిరీస్ ముగిసిన తర్వాత చిట్టగాంగ్ వేదికగానే డిసెంబర్ 14 నుంచి మొదటి టెస్టు జరుగుతుంది. మళ్లీ డిసెంబర్ 22న జరిగే ఆఖరి, రెండో టెస్టు కోసం ఢాకా చేరుకుంటుంది టీమిండియా.

ఇరుజట్ల మధ్య టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా హై డ్రామా నడిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన 184 పరుగులు చేసింది. అయితే బంగ్లాదేశ్ పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 ఓవర్లలో 67 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు...

ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత 16 ఓవర్లలో 151 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్, వరుస వికెట్లు కోల్పోయి 145 పరుగులకి పరిమితమైంది. విరాట్ కోహ్లీ అప్పీలు చేయడానే అంపైర్లు నో బాల్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు చేశారు బంగ్లా అభిమానులు. దీంతో పాటు విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ కారణంగా రావాల్సిన 5 పెనాల్టీ పరుగులు ఇవ్వలేదని బంగ్లా క్రికెటర్ నురుల్ హసన్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది... 

click me!