టీమిండియాని భయపెడుతున్న బంగ్లా... కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో మరో చెత్త రికార్డు...

By Chinthakindhi RamuFirst Published Dec 17, 2022, 11:34 AM IST
Highlights

తొలి టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసిన బంగ్లాదేశ్... టీమిండియా విధించిన లక్ష్యానికి 394 పరుగుల దూరంలో బంగ్లా..

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ పోరాడుతోంది. 513 పరుగుల భారీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్, తొలి వికెట్‌కి అజేయంగా సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. టెస్టుల్లో టీమిండియాపై బంగ్లాదేశ్ ఓపెనర్లు 100+ భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే మొట్టమొదటిసారి...

ఓవర్‌నైట్ స్కోరు 42/0 వద్ద నాలుగో రోజు ఆట మొదలెట్టిన బంగ్లాదేశ్, తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ కోల్పోకుండా 119 పరుగులు చేసింది బంగ్లాదేశ్. మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్న జాకీర్ హసన్ 109 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు చేయగా తొలి ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే డకౌట్ అయిన నజ్ముల్ హుస్సేన్ షాటో 143 బంతుల్లో 7 ఫోర్లతో 64 పరుగులు చేశాడు...

ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకుపోవడంతో వికెట్లు తీయడానికి భారత బౌలర్లు చెమటోడుస్తున్నా ఫలితం దక్కలేదు. టీమిండియా విధించిన లక్ష్యానికి ఇంకా 394 పరుగుల దూరంలో ఉంది బంగ్లాదేశ్. మరో ఐదు సెషన్ల ఆట మిగిలి ఉండడంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు పుషల్కంగా ఉన్నాయి...

2022 ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాపై వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయిన కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పిన కెఎల్ రాహుల్, బంగ్లా టూర్‌లోనూ చెత్త రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌‌కి 100+ భాగస్వామ్యం అందించిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు కెఎల్ రాహుల్...
 

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 61.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 258/2 పరుగులకి డిక్లేర్ చేసింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల కొండంత లక్ష్యాన్ని పెట్టింది...  జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లను విసిగించే ఛతేశ్వర్ పూజారా... 130 బంతుల్లో 13 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ఛతేశ్వర్ పూజారా కెరీర్‌లో ఇదే ఫాస్ట్ సెంచరీ. 52 ఇన్నింగ్స్‌లు, 1400+ రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ అందుకున్నాడు ఛతేశ్వర్ పూజారా. పూజారా సెంచరీ తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి 70 పరుగులు జోడించారు. 62 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మొదటి 54 బంతుల్లో 17 పరుగులే చేసిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత గేరు మార్చి బ్యాటింగ్ చేశాడు. 147 బంతుల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు గిల్. 

సెంచరీ పూర్తి చేసుకున్న కొద్ది సేపటికే శుబ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మెహిదీ హసన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి మోమినుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  పూజారా- శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  

click me!