చెత్త రికార్డులన్నీ బ్రేక్... 15 పరుగులకే ఆలౌట్ అయిన సిడ్నీ థండర్...

By Chinthakindhi RamuFirst Published Dec 16, 2022, 5:41 PM IST
Highlights

బీబీఎల్ 2022-23 సీజన్‌లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన సిడ్నీ థండర్... 15 పరుగులకే ఆలౌట్.. పవర్ ప్లే ముగియకుండానే ముగిసిన బ్యాటింగ్.. 

ఐపీఎల్‌లో ఏ జట్టు అయినా త్వరత్వరగా వికెట్లు కోల్పోయి ఆర్‌సీబీ 49 పరుగులకే ఆలౌట్ అయిన రికార్డును తుడిచి పెట్టకపోతారా? అని ఎదురుచూస్తారు అభిమానులు. అలాగే ఆడిలైడ్ టెస్టులో టీమిండియా చేసిన 36/9 ఘోర పరాభవాన్ని గుర్తు చేసుకుంటారు. అయితే ఈ రికార్డులన్నింటినీ తలదన్నుతూ, 15 పరుగులకే ఆలౌట్ అయ్యిందో టీ20 టీమ్...

మరీ 15 పరుగులకే ఆలౌట్ అయ్యిందంటే లోకల్ టీమ్ లేదా స్ట్రీట్ టీమ్ అయ్యి ఉంటుందో అనుకోవచ్చు. ఇది జరిగింది ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న బిగ్‌ బాష్ లీగ్‌లో... అవును! బీబీఎల్ 2022-23 సీజన్‌లో ఆడిలైడ్ స్ట్రైయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్ 5.5 ఓవర్లలో 15 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

తొలుత బ్యాటింగ్ చేసిన ఆడిలైడ్ స్ట్రైయికర్స్ 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేయడంతో 124 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది. కనీసం పవర్ ప్లే కూడా ముగియకుండా ఆలౌట్ అయిపోయింది సిడ్నీ థండర్. సీనియర్స్ టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు...

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆడిలైడ్ స్ట్రైయికర్స్... క్రిస్ లీన్ 27 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు, గ్రాండ్‌హోమ్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి రాణించడంతో 139 పరుగులు చేసింది. 140 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సిడ్నీ థండర్స్, తొలి ఓవర్ మూడో బంతికి మాథ్యూ గ్లెక్స్ వికెట్ కోల్పోయింది.

అక్కడి నుంచి ఏ దశలోనూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడలేదు. మాథ్యూ గ్లెక్స్, మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ డకౌట్ కాగా వన్‌డౌన్‌లో వచ్చిన రిలే రిసోయ్ 3 పరుగులు చేశాడు. కెప్టెన్ జాసన్ సంగాతో పాటు క్రిస్ గ్రీన్, గురిందర్ సంధు సున్నాకే పెవిలియన్ చేరారు.

అలెక్స్ రోస్ 2, డానియల్ సామ్స్ 1, ఓలివర్ డేవిస్ 1, బ్రెండన్ డొగ్నెట్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 10వ స్థానంలో వచ్చిన బ్రెండన్ డొగ్నెట్ ఒక్క ఫోర్ బాది టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే సిడ్నీ థండర్ టీమ్‌ ఏ లెవెల్‌లో బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. 

వచ్చిన 15 పరుగుల్లో 2 వైడ్లు, ఓ లెగ్ బై ఉన్నాయి. అంటే బ్యాటింగ్‌కి వచ్చిన 11 మంది కలిసి 12 పరుగులే చేశారన్నమాట. ఆడిలైడ్ స్ట్రైయికర్స్ బౌలర్ హెన్రీ థ్రోర్టన్ 2.5 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 3 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా వెస్ అగర్ 2 ఓవర్లలో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మాథ్యూ షార్ట్‌కి ఓ వికెట్ దక్కింది. 15 పరుగులకే అవుటైనా ముగ్గురు బౌలర్లలో ఒక్కరికీ కూడి హ్యాట్రిక్ పడకపోవడం మరో విశేషం.. 

2019లో చెక్ రిపబ్లిక్‌పై టర్కీ జట్టు 21 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ రికార్డును సిడ్నీ థండర్స్ తుడిచి పెట్టేసింది. 

click me!