
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు టెస్టు క్రికెట్ ఫ్యాన్స్. అయితే మొదటి రెండు టెస్టుల్లో ఆ అంచనాలను అందుకోలేకపోయింది ఆస్ట్రేలియా. ఐసీసీ నెం.1 టెస్టు టీమ్, భారత్‌లో బ్యాటింగ్ చేయడానికి తెగ కష్టపడుతోంది... తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా, రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకు ఆలౌట్ అయింది.
రెండో టెస్టు రెండో రోజు ఆఖరి సెషన్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేసింది ఆస్ట్రేలియా. గాయపడిన డేవిడ్ వార్నర్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ట్రావిస్ హెడ్, ఆరంభం నుంచి భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగాడు. ఫలితం 12 ఓవర్లలో 61 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...
మూడో రోజు ఇదే స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తే టీమిండియా ముందు భారీ టార్గెట్ ఉండడం పక్కా. బౌండరీలు బాదుతూ భారత బౌలర్లను ఒత్తిడిలో నెట్టేయాలని అనుకున్న ట్రావిస్ హెడ్, మూడో రోజు మొదటి ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు. అంతే.. అక్కడి నుంచి ఆస్ట్రేలియా ఒక్కో వికెట్ కోల్పోతూ 52 పరుగుల తేడాతో 9 వికెట్లు నష్టపోయి, ఆలౌట్ అయ్యింది..
ఆస్ట్రేలియా వంటి టాప్ టీమ్ నుంచి ఫ్యాన్స్ ఇలాంటి పర్ఫామెన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వార్ వన్‌సైడ్ సాగితే చూసేవాళ్లకు కిక్ ఉండదు. అది కూడా ఆస్ట్రేలియా వంటి టీమ్‌తో టెస్టు మ్యాచులు మూడు రోజుల్లో ముగిసిపోతే, కిక్కు అస్సలు ఉండదు.. టెస్టు మ్యాచ్ 5 రోజుల పాటు సాగుతుందని, అసలైన మజా ఆఖరి 2 రెండు రోజుల్లోనే ఉంటుందని.. నాలుగు, ఐదో రోజు టికెట్లు కొన్నవాళ్లు, నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సీజన్‌లో నాలుగు మ్యాచులు కూడా ఐదు రోజుల పాటు హోరాహోరీగా సాగాయి. ఆడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36/9 ఘోర పరాభవం తర్వాత టీమిండియా, అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చి మెల్‌బోర్న్ టెస్టు గెలిచింది. ఆ తర్వాత సిడ్నీ టెస్టు చారిత్రాత్మకం..
ఆఖరి రోజు 5 వికెట్లు కోల్పోయిన తర్వాత హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ 47 ఓవర్లకు పాటు వికెట్ కాపాడుకుంటూ వీరోచిత బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరినీ అవుట్ చేసేందుకు ఆసీస్ బౌలర్లు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.. చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది...
ఇక బ్రిస్బేన్ టెస్టు, ఈ దశాబ్దంలోనే బెస్టు టెస్టు మ్యాచుల్లో ఒకటి. జడేజా, అశ్విన్, బుమ్రా, విహారి, కెఎల్ రాహుల్ గాయపడడంతో స్టార్ ప్లేయర్లు లేకుండా రిజర్వు బెంచ్ ప్లేయర్లతో బరిలో దిగింది భారత జట్టు. చివరి రోజు శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్‌లు అసాధారణం..
32 ఏళ్లుగా ఓటమి ఎరుగని గబ్బాలో ఆస్ట్రేలియాకి అదిరిపోయే దెబ్బ రుచి చూపించింది భారత జట్టు. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అలాంటి కిక్ దొరకడం లేదు. రిషబ్ పంత్ లేకపోవడం వల్లనో, లేక విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కాకపోవడం వల్లనో కానీ చప్పటి కూడులా మారిన ఈ సిరీస్‌లో మసాలా జోడించే దినుసులు మిస్ అవుతున్నాయి. యుద్ధపోరులా సాగుతుందన్న టెస్టు సిరీస్... వన్‌సైడ్ వార్‌గా పరమ బోరింగ్‌గా మారింది...
మూడు, నాలుగు టెస్టుల్లో టీమిండియా టాస్ గెలిచి ఓ రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసి... ఆ తర్వాత ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ అప్పగిస్తే కానీ... ఈ టెస్టు సిరీస్‌లో మ్యాచులు నాలుగు, ఐదో రోజు వరకూ వెళ్లడం కష్టంగానే కనిపిస్తోంది. చివరి రెండు టెస్టుల్లో అయినా ఆసీస్, నెం.1 టీమ్‌లా ఆడుతుందో లేదో చూడాలి..