రాహుల్ వైస్ కెప్టెన్సీ ఊడింది.. రెండు టెస్టులు, వన్డేలకు జట్టు ప్రకటన.. పరిమిత ఓవర్లలో ఉనద్కత్‌కు ఛాన్స్

Published : Feb 19, 2023, 06:18 PM ISTUpdated : Feb 19, 2023, 06:41 PM IST
రాహుల్ వైస్ కెప్టెన్సీ ఊడింది.. రెండు టెస్టులు, వన్డేలకు జట్టు ప్రకటన.. పరిమిత ఓవర్లలో ఉనద్కత్‌కు ఛాన్స్

సారాంశం

BCCI: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో  మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టును  బీసీసీఐ ప్రకటించింది.  గత కొంతకాలంగా  దారుణంగా విఫలమవుతున్న  కెఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించకున్నా   వైస్ కెప్టెన్సీని మాత్రం   తొలగించింది. 

ఆస్ట్రేలియాతో  తదుపరి రెండు టెస్టులకు  గాను  బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఢిల్లీ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించిన తర్వాత  బీసీసీఐ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్న జట్టు సభ్యులలో   పెద్దగా మార్పేమీ లేదు.  అదే జట్టును బీసీసీఐ కొనసాగించింది. అయితే వరుసగా విఫలమవుతున్న  కెఎల్ రాహుల్  కు ఉద్వాసన తప్పదని  భావించినా అతడు తన ప్లేస్ ను కాపాడుకున్నాడు.  వన్డేలలో జయదేవ్ ఉనద్కత్ కు చోటు దక్కింది. 

భారత జట్టు ఆసీస్ పై  ఇదివరకే తొలి రెండు టెస్టులనూ గెలిచి సిరీస్ ను  నిలుపుకుంది. ఈ సిరీస్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప  ఆసీస్ డ్రా నుంచి తప్పించుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో  జట్టు కూర్పును  మార్చడం ఎందుకనుకున్నారో ఏమో గానీ సెలక్టర్లు  పెద్దగా మార్పులేమీ చేయలేదు. 

కానీ బీజీటీ లో మిగిలిన రెండు టెస్టులకైనా దేశవాళీ సూపర్ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ ను అవకాశం వస్తుందని అందరూ భావించినా అతడికి మరోసారి నిరాశే ఎదురైంది.  అయితే  పదే పదే విఫలమవుతున్న  టీమిండియా  స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ మాత్రం.. టెస్టులలో వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. అతడి స్థానంలో కొత్త వైస్ కెప్టెన్ ఎవరన్నది మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. 

మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా,  మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ 

వన్డేలకు  ఉనద్కత్.. 

టెస్టులతో పాటు వన్డే సిరీస్ కూ  జట్టును ప్రకటించారు. ఈ టీమ్ లో కూడా పెద్దగా మార్పులేమీ లేకున్నా రవీంద్ర జడేజా తిరిగి  టీమ్ తో కలవనున్నాడు.  అయితే  అనూహ్యంగా జయదేవ్ ఉనద్కత్ ను  జట్టులోకి ఎంపిక చేయడం ఆశ్చర్యకర ఎంపిక.  రంజీ ట్రోఫీతో పాటు దేశవాళీలో రాణిస్తున్న అతడు పదేండ్ల తర్వాత  మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.  జడేజా, కెఎల్ రాహుల్ లు తిరిగి జట్టుతో చేరడంతో రజత్ పాటిదార్, షాదాబ్ ఖాన్ లు స్థానం కోల్పోయారు.  

 

మార్చి 17న మొదలయ్యే వన్డే సిరీస్ లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.  అయితే తొలి వన్డేకు రోహిత్  అందుబాటులో ఉండడు. దీంతో ఈ మ్యాచ్ లో  హార్ధిక్ పాండ్యా సారథిగా వ్యవహరించనున్నాడు.  

వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !