సిరాజ్ కమాల్, షమీ ఫైర్... 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా...

By Chinthakindhi RamuFirst Published Feb 9, 2023, 9:49 AM IST
Highlights

India vs Australia 1st test: 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా... ఓపెనర్లు ఇద్దరూ అవుట్.. 

India vs Australia 1st test: నాగ్‌పూర్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ తగిలింది. 2.1 ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది టీమిండియా. రెండో ఓవర్ మొదటి బంతికి మహ్మద్ సిరాజ్, ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేయగా, మూడో ఓవర్ తొలి బంతికి డేవిడ్ వార్నర్‌కి క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ...


మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లో 2 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మహ్మద్ సిరాజ్, తొలి బంతికి ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశాడు. ఎల్బీడబ్ల్యూకి టీమిండియా అప్పీలు చేసినా, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇన్నింగ్స్ ఏడో బంతికే డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్న టీమిండియా, కావాల్సిన ఫలితం రాబట్టింది.

టీవీ రిప్లైలో బంతికి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో ఉస్మాన్ ఖవాజా 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో ఓవర్ మొదటి బంతికి డేవిడ్ వార్నర్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ. దీంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.. 

భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంపై పూర్తి ఫోకస్ పెట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత ఫాస్ట్ బౌలర్లు ఇబ్బంది పెడుతుండడం విశేషం. క్రీజులో ఉన్న ఐసీసీ నెం. 1 టెస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్, నెం.1 బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్లు కోల్పోతే ఆస్ట్రేలియా‌ని తక్కువ స్కోరుకి పరిమితం చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు...

అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించాలంటే ఈ సిరీస్ గెలవడం చాలా అవసరం..

నేటి మ్యాచ్ ద్వారా సూర్యకుమార్ యాదవ్‌తో పాటు తెలుగు వికెట్ కీపింగ్ బ్యాటర్ కెఎస్ భరత్, టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నారు. సూర్యకి ఇది టెస్టుల్లో మొదటి మ్యాచ్ కాగా కోన శ్రీకర్ భరత్‌కి మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్... 

శుబ్‌మన్ గిల్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తారని ప్రచారం జరిగినా టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం కల్పించింది టీమిండియా. దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ బాది, టీ20ల్లో సెంచరీ నమోదు చేసి బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు...

2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్య, రెండేళ్ల తర్వాత టెస్టుల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. టెస్టు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి రెస్ట్ ఇచ్చినప్పటి నుంచి టెస్టు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాడు కె.ఎస్ భరత్... 

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకి దూరం కావడంతో భరత్‌కి ఎట్టకేలకు తుదిజట్టులో ఆడే అవకాశం దక్కింది. ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న టీమిండియా, మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాని కనీసం 2-0 తేడాతో ఓడిస్తే... ఆసీస్‌ని వెనక్కినెట్టి టాప్ ప్లేస్‌ని చేరుకుంటుంది.

click me!