
అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఇండయా- ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో టీమిండియా ధీటుగా సమాధానం ఇచ్చే దిశగా సాగుతోంది. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది భారత జట్టు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగుల స్కోరుకి ఇంకా 118 పరుగుల దూరంలో ఉంది టీమిండియా...
ఓవర్‌నైట్ స్కోరు 289/3 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది. 84 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఉస్మాన్ ఖవాజాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
అయితే శ్రీకర్ భరత్‌తో కలిసి ఐదో వికెట్‌కి 144 బంతుల్లో అజేయంగా 53 పరుగుల భాగస్వామ్యం జోడించాడు విరాట్ కోహ్లీ. 220 బంతుల్లో 5 ఫోర్లతో 88 పరుగులు చేసిన విరాట్ కోహ్లీతో పాటు శ్రీకర్ భరత్ 70 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు...
మొదటి ఐదు వికెట్లకు కూడా 50+ భాగస్వామ్యాలు నమోదు చేయడం ఇండియాకి ఇది మూడొసారి. ఇంతకుముందు 1993లో ముంబైలో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌పై ఈ ఫీట్ సాధించింది భారత జట్టు. 2007లో మీర్‌పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై ఈ ఫీట్ సాధించిన టీమిండియా, ఆస్ట్రేలియాపై మొదటిసారి ఈ రికార్డు కొట్టింది...
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతను బ్యాటింగ్‌కి వస్తాడా? రాడా? అనేది అనుమానంగా మారింది. శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కి రాకపోతే తొలి ఇన్నింగ్స్‌లో 10 మంది బ్యాటర్లు మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ రిటైర్డ్ హర్ట్‌గా అవుట్ అవుతాడు.
రెండో ఇన్నింగ్స్ వరకూ ఆట సాగితే కంకూషన్ సబ్‌స్టిట్యూట్ రూపంలో సూర్యకుమార్ యాదవ్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే నాలుగు రోజుల ఆట పూర్తి కావడంతో టీమిండియాకి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రావాలంటే... మూడో ఇన్నింగ్స్‌లో అద్భుతం జరగాల్సిందే.
ఇంకా ఐదు సెషన్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం అనుమానంగా మారింది. పిచ్ ఇప్పుడిప్పుడే స్పిన్నర్లకు అనుకూలించడం మొదలెట్టింది...
టీమిండియా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుండడంతో మిగిలిన రెండు సెషన్లు బ్యాటింగ్ చేసినా ఆస్ట్రేలియాపై ఆధిక్యం సాధించడం అనుమానమే. ఆధిక్యం రాకుండా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ మొదలెడితే 10 వికెట్లు తీసి, నాలుగో ఇన్నింగ్స్‌లో ఆ లక్ష్యాన్ని ఛేదించడం అయ్యే పని కాదు. దీంతో అహ్మదాబాద్ టెస్టు డ్రా దిశగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది..
రెండో సెషన్‌లో టీమిండియా బ్యాటర్లు దూకుడు పెంచి, బౌండరీలు బాదితే... మ్యాచ్‌ని తిరిగి చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కి సహకరించిన పిచ్, ఇప్పుడు బౌలర్లకు అనుకూలించడం మొదలెట్టింది. దీంతో మ్యాచ్ ఎటువైపు మళ్లుతుందో చెప్పడం కష్టం...