హార్ధిక్ పాండ్యా అవుట్! ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా... ఇంకా విజయానికి...

By Chinthakindhi RamuFirst Published Mar 17, 2023, 7:06 PM IST
Highlights

India vs Australia 1st ODI: 83 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా... ఇంకా విజయానికి 106 పరుగుల దూరంలో భారత జట్టు.. కెఎల్ రాహుల్‌పైనే భారం.. 

ముంబై వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 189 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, 19.2 ఓవర్లు ముగిసే సమయానికి 83 పరుగులు చేసి, కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది...

16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టును, శు‌బ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. 31 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 39 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా...

 ఈ దశలో హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ కలిసి ఐదో వికెట్‌‌కి 44 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 31 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, స్టోయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి... బౌండరీ లైన్ దగ్గర కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

83 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు. టీమిండియా విజయానికి ఇంకా 106 పరుగులు కావాలి. క్రీజులో ఉన్న కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అవుటైతే ఆ తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో చెప్పుకోదగ్గర బ్యాటర్లు కూడా లేరు. దీంతో ఈ ఇద్దరిపైనే మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది. 

189 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి మొదటి ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే రాగా రెండో ఓవర్‌లో ఇషాన్ కిషన్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు మార్కస్ స్టోయినిస్. 5 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ని వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్ డ్రాప్ చేశాడు... లేకపోతే రెండు బంతుల వ్యవధిలో రెండో వికెట్ పడి ఉండేది..

9 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తాను వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలుసుకున్న విరాట్ కోహ్లీ, కనీసం డీఆర్‌ఎస్ కూడా తీసుకోకుండా పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాతి బంతికి సూర్యకుమార్ యాదవ్‌ని డకౌట్ చేశాడు మిచెల్ స్టార్క్. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకున్న ఆస్ట్రేలియాకి అనుకూలంగా ఫలితం వచ్చింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్.. మొదటి 5 ఓవర్లలో 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 188 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మిచెల్ మార్ష్ 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన ఆసీస్ బ్యాటర్లు ఎవ్వరూ 30 ప్లస్ స్కోరు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో సిరాజ్, షమీ మూడేసి వికెట్లు తీయగా రవీంద్ర జడేజాకి 2 వికెట్లు దక్కాయి. 

click me!