సీనియర్లకు సెలవు.. ఐపీఎల్ వీరులకు పిలుపు..? విండీస్ టూర్‌లో భారీ మార్పులు..!

By Srinivas MFirst Published Jun 6, 2023, 9:52 AM IST
Highlights

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ తర్వాత  భారత జట్టు తిరిగి  అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడనుంది. జులై - ఆగస్టులో  టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. 

ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ, ఆపై ఐపీఎల్ బిజీలో గడిపిన టీమిండియా.. మళ్లీ అంతర్జాతీయ టీ20లు ఆడలేదు.  రేపటి (జూన్ 7) నుంచి ఆస్ట్రేలియాతో  ప్రారంభం కాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ తర్వాత  భారత జట్టు తిరిగి  అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడనుంది. జులై - ఆగస్టులో  టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇక్కడ  రెండు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్ లు ఆడేందుకు   షెడ్యూల్ సిద్ధమైంది. అయితే టీ20   సిరీస్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశముంది. 

టీ20 ప్రపంచకప్ - 2022 తర్వాత  టీమిండియా వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ వంటి వారికి విశ్రాంతినిస్తున్న  సెలక్టర్లు.. విండీస్ టూర్ లో కూడా ఇదే ఫార్ములాను  ఫాలో అవనున్నారు. వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు  యువ ఆటగాళ్లను ఆదిశగా ప్రిపేర్ చేయాలని బీసీసీఐ భావిస్తున్నది. 

ఇందులో భాగంగానే సీనియర్లకు విశ్రాంతినిచ్చి  ఐపీఎల్ లో తమ మెరుపులతో అలరించిన ముంబై కుర్రాడు యశస్వి జైస్వాల్,  యూపీ యువ సంచలనం రింకూ సింగ్,  వికెట్ కీపర్ జితేశ్ శర్మ  వంటి ఆటగాళ్లకు  వెస్టిండీస్ టీమ్ లో చోటు దక్కే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ సీజన్ లో  స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మకు కూడా  సెలక్టర్లు  జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 

టీ20లలో రోహిత్‌ను ఇదివరకే పక్కనబెట్టేసిన సెలక్టర్లు..  హార్ధిక్ పాండ్యాకే వాటికి అప్పగించనున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన  టీ20 సిరీస్ లకు హార్ధికే సారథిగా వ్యవహరించాడు. అతడికి డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు.  ఐపీఎల్ లో ఓపెనర్ గా అదరగొట్టిన జైస్వాల్ ను ఎంపిక చేస్తే ఇషాన్ కు అతడు పోటీ  అవుతాడు. అయితే  గిల్ కు జోడీగా ఈ ఇద్దరు ఎడం చేతి వాటం  బ్యాటర్లలో ఎవర్ని పంపుతారనేది  చూడాలి. ఫినిషర్ గా కోల్కతా నైట్ రైడర్స్ విజయాలలో కీలక పాత్ర పోషించి సీజన్ మొత్తం నిలకడగా రాణించిన  రింకూకు  ఛాన్స్ ఇస్తారా..?  ఇక శ్రీలంకతో ఈ ఏడాది జనవరి జరిగిన టీ20 సిరీస్ లో సంజూ శాంసన్ గాయంతో టీమ్ లోకి వచ్చిన జితేశ్ శర్మ కూడా ఈ సీజన్ లో తానెంటో నిరూపించుకున్నాడు. దీంతో శాంసన్ కు మరోసారి నిరాశే తప్పకపోవచ్చు.   జితేశ్ ను ఎంపిక చేస్తే అప్పుడు ఇషాన్ ప్లేస్ కూడా ప్రమాదంలో పడే అవకాశముంది. 

click me!