Imran Khan: ప్రపంచ క్రికెట్ ను భారత్ డబ్బుతో శాసిస్తోంది: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

By team teluguFirst Published Oct 12, 2021, 1:11 PM IST
Highlights

Imran Khan: పాకిస్థాన్ ప్రధాని, ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్ భారత్ చెప్పుచేతల్లో ఉందని ఇమ్రాన్ వ్యాఖ్యానించాడు. 

సమయం దొరికినప్పుడల్లా భారత్ ను నిందించే Pakistan ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. ప్రపంచ క్రికెట్ భారత్ గుప్పిట్లో ఉన్నదని అన్న ఇమ్రాన్ ఖాన్.. డబ్బు కారణంగా ఇండియా క్రికెట్ ను శాసిస్తుందని వ్యాఖ్యానించాడు. ఇటీవల న్యూజిలాండ్,  ఇంగ్లండ్ జట్లు.. పాకిస్థాన్ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకోవడం తనకు నిరాశకు గురి చేసిందని తెలిపాడు. 

ఒక టెలివిజన్ ఛానల్ తో మాట్లాడిన Imran Khan.. ‘ఇప్పుడు డబ్బు అనేది   అన్ని రంగాల్లో కీలకం. ఆటగాళ్లకైనా, దేశాల క్రికెట్ బోర్డుల కైనా అదే అవసరం. ఆ డబ్బు Indiaలో చాలా ఉంది. అందుకే ప్రపంచ క్రికెట్ ను భారత్ శాసిస్తోంది. వాళ్లకు ఏం కావాలంటే అది జరుగుతుంది. భారత్ ను సవాల్ చేసే ధైర్యం ఇతర క్రికెట్ జట్లు చేయడంలేదు.ఒకవేళ అలా చేస్తే ఏమవుతుందో వారికి తెలుసు..’ అని అన్నారు. 

ఇంగ్లండ్, న్యూజీలాండ్ లు సిరీస్ రద్దు చేసుకోవడంపై స్పందిస్తూ.. ‘ఇంగ్లండ్ నిర్ణయం నన్ను నిరాశపరిచింది. పాకిస్థాన్ వంటి దేశాలతో  ఆడటానికి వాళ్లు ముందుకువస్తారని భావన వాళ్లకు ఇప్పటికీ ఉంది. కానీ కారణం ఏమిటంటే.. డబ్బు..’ అని తెలిపారు.

తమ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకే భారత్ ఇలా చేస్తుందని పాక్ ప్రధాని పరోక్షంగా ఈ కామెంట్స్ చేశాడు. ఐసీసీపై పెత్తనం చెలాయిస్తూ పాక్ క్రికెట్ బోర్డును అణిచివేయాలని చూస్తున్నదని ఆయన ఆరోపించాడు. వారం రోజుల క్రితం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి చైర్మెన్ గా ఎన్నికైన రమీజ్ రాజా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ‘పీసీబీకి ఐసీసీ 50 శాతం నిధులు సమకూరుస్తున్నది. కానీ ఐసీసీకి బీసీసీఐ నుంచి 90 శాతం నిధులు అందుతున్నాయి. ఒక విధంగా భారతీయ వ్యాపార సంస్థలు పాక్ క్రికెట్ ను నిర్వహిస్తున్నాయి. ఒకవేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ కు మేము ఎలాంటి నిధులు ఇవ్వలేమని  భావిస్తే ఈ క్రికెట్ బోర్డు కుప్పకూలిపోతుంది’ అని అన్న మాటలు తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. 

click me!