నాగ్‌పూర్‌లో హిట్‌మ్యాన్ విధ్వంసం.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సజీవం

By Srinivas MFirst Published Sep 23, 2022, 11:05 PM IST
Highlights

IND vs AUS T20I Live: 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో ఆసీస్ నిర్దేశించిన 91 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 4 బంతులు మిగిలుండగానే ఊదేసింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ  వీరవిహారం చేసి సిరీస్ ను సమం చేశాడు. 

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.  నాగ్‌పూర్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ముగిసిన రెండో మ్యాచ్‌లో ఆసీస్ నిర్దేశించిన 91  పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. భారత జట్టు సారథి రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) నాగ్‌పూర్‌లో వీరవిహారం చేసి సిరీస్ లో భారత్ ఆశలను సజీవంగా ఉంచాడు. రోహిత్ దూకుడుకు ఆసీస్ నిలిపిన లక్ష్యం 7.2 ఓవర్లలోనే ఆవిరైపోయింది. ఈ విజయంతో భారత్ సిరీస్ ను 1-1 తో సమం చేసింది. సిరీస్ విజేతను తేల్చే మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాద్ లో జరుగనుంది.  

48 బంతుల్లో  91 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి క్రీజులోకి వచ్చిన టీమిండియాకు తొలి ఓవర్లోనే ఘనమైన ఆరంభం దక్కింది. హెజిల్వుడ్ వేసిన  తొలి ఓవర్లో టీమిండియా సారథి  రోహిత్ శర్మ వరుసగా రెండు సిక్సర్లు బాది నాగ్‌పూర్ స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. తానేం తక్కువ తిన్నానా అని అదే ఓవర్లో చివరి బంతికి  రాహుల్ కూడా బంతిని స్టాండ్స్ లోకి పంపాడు. ఆ ఓవర్లో 20 పరుగులొచ్చాయి.

అదే ఊపులో  కమిన్స్ వేసిన రెండో ఓవర్లో కూడా రోహిత్ మరో సిక్సర్ బాదాడు. ఆ ఓవర్లో పది పరుగులొచ్చాయి.  రెండు ఓవర్లకే భారత్ 30 పరుగులు సాధించింది. 

స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన మూడో ఓవర్లో మూడో బంతికి రోహిత్ సిక్సర్ బాదగా.. ఐదో బంతికి రాహుల్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో  39 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మూడో ఓవర్లో కూడా పది పరుగులొచ్చాయి. 

వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ  (11) రెండు ఫోర్లు కొట్టి టచ్ లో కనిపించినా జంపా వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో తర్వాత బంతికి సూర్యకుమార్ యాదవ్ (0) కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.  ఐదు ఓవర్లు ముగిసేసరికి  ఇండియా స్కోరు 58-3 గా ఉంది. 

చివరి మూడు ఓవర్లలో 33 పరుగులు చేయాల్సిన క్రమంలో.. హార్ధిక్ పాండ్యా (9) తో కలిసి హిట్‌మ్యాన్ రెచ్చిపోయాడు.  సీన్ అబాట్ వేసిన ఆరో ఓవర్లో రెండు వరుస బౌండరీలు బాదాడు. ఆ ఓవర్లో 11 పరుగులొచ్చాయి. కానీ కమిన్స్ వేసిన ఏడో ఓవర్లో ఫోర్ కొట్టిన పాండ్యా.. చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి ఫించ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ చివరి బంతికి రోహిత్ బౌండరీ కొట్టి భారత్ ను విజయానికి దగ్గర చేశాడు. 

 

MAXIMUMS! 👌 👌

The SIX Special edition is on display! 👏 👏

Follow the match ▶️ https://t.co/LyNJTtl5L3

Don’t miss the LIVE coverage of the match on pic.twitter.com/OjgYFYnQZs

— BCCI (@BCCI)

ఇక చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సి ఉండగా..  డేనియల్ సామ్స్ వేసిన తొలి బంతికే ఫినిషర్ దినేశ్ కార్తీక్ (2 బంతుల్లో 10 నాటౌట్, 1 సిక్స్, 1 ఫోర్) భారీ సిక్సర్ బాదాడు. రెండో బంతికి బౌండరీ  కొట్టడంతో నాగ్‌పూర్ విజయనాదాలతో హోరెత్తింది. 

ఆసీస్ బౌలర్లలో జంపా.. 2 ఓవర్లు వేసి 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కమిన్స్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 8 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (43 నాటౌట్), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (31) మెరుపులు మెరిపించారు. భారత బౌలర్లలో అక్షర్ రెండు వికెట్లు తీయగా బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. 

 

A Hitman special to level the series in Nagpur 🔥 pic.twitter.com/Q5NHRxrlCw

— Wisden India (@WisdenIndia)
click me!