IND vs PAK: షార్జాలో మాతో మ్యాచ్ ఆడేందుకు భయపడుతున్నారా..? టీమిండియాపై పాక్ మాజీ ఆటగాడి షాకింగ్ కామెంట్స్

By Srinivas MFirst Published Sep 4, 2022, 3:11 PM IST
Highlights

Asia Cup 2022: ఇండియా-పాకిస్తాన్ ల మధ్య దుబాయ్ వేదికగా  ఆసియా కప్-2022లో భాగంగా నేడు సూపర్-4 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు  పాకిస్తాన్ మాజీ ఆటగాడు టీమిండియాపై సంచలన కామెంట్స్ చేశాడు. 

భారత్-పాక్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా అవి ఆసక్తికరమే. ద్వైపాక్షిక సిరీస్ లు పక్కనబెడితే ఐసీసీ, ఆసియా కప్ వంటి మెగా టోర్నీలలో పాకిస్తాన్ పై భారత్ దే పూర్తి ఆధిపత్యం. ఆసియా కప్-2022లో కూడా  గత ఆదివారం ముగిసిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను భారత్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. నేడు (సెప్టెంబర్4న) ఇరు జట్ల మధ్య సూపర్-4 పోరు జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఎప్పటిలాగే పాకిస్తాన్ మైండ్ గేమ్ కు తెరతీసింది. ఆ జట్టు మాజీ ఆటగాడు సికందర్ భక్త్ తాజాగా టీమిండియా పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తమతో యూఏఈలో మ్యాచ్ ఆడాలంటే భారత్.. దుబాయ్ స్టేడియాన్నే కోరుకుంటుంది గానీ షార్జా   అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎందుకు ఆడటం లేదని సికందర్  ప్రశ్నించాడు.  ఇది తన ప్రశ్న కాదని.. మొత్తం పాకిస్తాన్ తెలుసుకోవాలని అనుకుంటుందని అన్నాడు. 

సూపర్-4 పోరుకు ముందు పాకిస్తాన్ టీవీ ఛానెల్ లో జరిగిన చర్చలో భాగంగా  సికందర్ ఈ ప్రశ్న వేశాడు. ఈ టీవీ చర్చలో   సికందర్ తో పాటు ఇంజమామ్ ఉల్ హక్ కూడా ఉన్నాడు. భారత్ నుంచి  కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్, అతుల్ వాసన్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సికందర్ మాట్లాడుతూ.. ‘యూఏఈలో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడాలంటే దుబాయ్ నే ఎందుకు ఎంచుకుంటున్నది...?  షార్జా, అబుదాబిలో ఎందుకు ఆడటం లేదు.  వాస్తవానికి  ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ -2022లో కూడా నేడు జరగాల్సి ఉన్న సూపర్-4  మ్యాచ్ షార్జాలో జరగాలి. కానీ దానిని బీసీసీఐ దుబాయ్ కు మార్పించింది. ఎందుకిలా..? మాతో మ్యాచ్ అంటే భయపడుతున్నారా..? నేను ఈ ప్రశ్న నా సొంతంగా అడగడం లేదు. పాకిస్తాన్ ప్రజానీకం తరఫున అడుగుతున్నా...’ అని ప్రశ్నించాడు. 

దీనికి కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్ధీన్ లు స్పందించకపోయినా అతుల్ వాసన్ మాత్రం కౌంటర్ ఇచ్చాడు. షార్జా పిచ్  తమకు అచ్చిరాదని చెప్పాడు. ‘షార్జా మైదానం మాకు అంత మంచిదికాదు. ఇప్పుడు మేం ఐసీసీ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం.  అందుకే మేము అక్కడ ఆడటం లేదు..’ అని నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు. 

 

గతంలోకి వెళ్తే..  1986లో  షార్జా వేదికగా ఆసియా కప్ ఫైనల్ జరిగింది.  ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ అనూహ్య విజయం సాధించింది.  తద్వారా తొలి ఆసియా కప్ ను గెలుచుకుంది. పాకిస్తాన్ దిగ్గజ బ్యాటర్ జావేద్ మియాందాద్  ఆఖరు బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించింది ఇక్కడే. అప్పట్నుంచి భారత్ అక్కడ పెద్దగా మ్యాచ్ లు ఆడటం లేదు.  యూఏఈలో ఆడుతున్నా  దుబాయ్, అబుదాబి వేదికల మీదే ఎక్కువగా ఆడుతున్నది. ప్రస్తుతం ఆసియా కప్ లో ఇతర జట్లు షార్జాలో ఆడుతున్నా టీమిండియా మ్యాచులన్నీ దుబాయ్ వేదికగానే జరుగుతుండటం గమనార్హం. 

click me!