IND vs PAK: వాళ్లను అడ్డుకోవాలి.. వీళ్లను నిలువరించాలి.. లేకుంటే పాక్‌తో మ్యాచ్‌లో కష్టమే..!

By Srinivas MFirst Published Sep 4, 2022, 12:49 PM IST
Highlights

Asia Cup 2022: సూపర్-4 లో భారత్-పాకిస్తాన్ మధ్య  నేడు దుబాయ్ వేదికగా  మరో రసవత్తర పోరుకు తెరలేవనున్నది. ఈ నేపథ్యంలో భారత జట్టు రెండు విభాగాలలో  దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. 

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానులలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. కానీ ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. మ్యాచ్ లో ఒత్తిడిని చిత్తు చేసేవాళ్లే విజేతలు. ఆసియా కప్-2022లో భాగంగా గ్రూప్ దశలో ముగిసిన  భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చివరివరకు ఉత్కంఠగా సాగినా చివర్లో హార్ధిక్ పాండ్యా ఒత్తిడిని చిత్తు చేసి భారత్ కు విజయాన్ని అందించాడు. నేడు జరుగబోయే సూపర్ - 4లో భారత్ ఒత్తిడికి లోనుకావొద్దంటే బలంగా కనిపిస్తున్న పాకిస్తాన్ ను నిలువరించాల్సిందే. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్.. ఈ కింది విషయాలపై దృష్టి సారించాల్సిందే. 

పాకిస్తాన్ బ్యాటింగ్ విషయంలో భారత్ ముఖ్యంగా బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ తో పాటు ఫకర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్ లను అడ్డుకోవాలి. ఈ టోర్నీలో భాగంగా ఇప్పటివరకు పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచులలో పెద్దగా రాణించని బాబర్ ఆజమ్ ఎప్పటికైనా ప్రమాదకారే.  

బాబర్ తో పాటు రిజ్వాన్ ను త్వరగా ఔట్ చేయగలిగితే పాకిస్తాన్ సగం బలం కోల్పోయినట్టే. వాళ్లిద్దరే ఆ జట్టు బ్యాటింగ్ కు పెద్ద దిక్కు.  వన్ డౌన్ లో వచ్చే ఫకర్ జమాన్, ఇఫ్తికర్ తో పాటు ఆరో స్థానంలో  బ్యాటింగ్ కు వచ్చే ఖుష్దిల్  లను భారత్ త్వరగా నిలువరించగలిగితే పాక్ భారీ స్కోరు చేసే అవకాశాలుండవు.  హాంకాంగ్ తో మ్యాచ్ లో ఖుష్దిల్ వీరవిహారం చేసి పాకిస్తాన్ భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డాడు. ఈ ఐదుగురిని కట్టడి చేస్తే భారత్ సగం విజయం సాధించినట్టే. 

ఇక బౌలింగ్ విషయానికొస్తే  అంతగా అనుభవం లేకున్నా పాకిస్తాన్ ఎప్పటికీ బౌలింగ్ లో ప్రమాదకారే. ఈ టోర్నీకి ముందు పాక్ ప్రధాన పేసర్ షాహిన్ షా అఫ్రిది  గాయం కారణంగా   తప్పుకున్నా 19 ఏండ్ల కుర్రాడు నసీం షా ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. గత ఆదివారం భారత్-పాక్ మ్యాచ్ లో టీమిండియాను తొలి దెబ్బ కొట్టింది నసీం షాయే.  అతడు వేసిన రెండో బంతికి కెఎల్ రాహుల్ వికెట్ల మీదకు ఆడుకుని వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు.  స్వింగ్, పేస్ కలగలిపిన బౌలింగ్ తో నసీం షా  పాక్ బౌలింగ్ కు వెన్నెముకలా మారాడు.

షా తో పాటు స్పిన్నర్లు షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ లు కూడా భారత్ కు షాకివ్వడానికి సిద్ధమయ్యారు. గత మ్యాచ్ లో మహ్మద్ నవాజ్.. రోహిత్, కోహ్లీ తో పాటు జడేజా వికెట్ తీశాడు.  హాంకాంగ్ తో మ్యాచ్ లో నవాజ్ 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా మరో స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగాడు. నేటి మ్యాచ్ లో  భారత్.. నసీం షా, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ లను సమర్థవంతంగా నిలువరించగలిగితేనే  ఫలితం మనకు అనుకూలంగా ఉండనుంది. లేకుంటే లెక్కలు తారుమారయ్యే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. 

click me!