IND vs SA: విజయంతో ముగించాలని.. మూడో టీ20లో టాస్ నెగ్గిన టీమిండియా.. ఆ ముగ్గురూ లేకుండానే బరిలోకి..

By Srinivas MFirst Published Oct 4, 2022, 6:37 PM IST
Highlights

IND vs SA T20I: భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికాను వరుసగా రెండు టీ20లలో ఓడించిన  రోహిత్ సేన.. ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో   మ్యాచ్ లో పలు మార్పులతో బరిలోకి దిగుతున్నది. 

ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న టీ20  ప్రపంచకప్‌కు ముందు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు చివరి టీ20 ఆడుతున్నది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికాను ఇప్పటికే   రెండు మ్యాచ్ లలో  ఓడించి సిరీస్ చేజిక్కించుకున్న భారత జట్టు.. ఇండోర్ (మధ్యప్రదేశ్) వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నది.  ఈ  మ్యాచ్ తర్వాత  భారత జట్టు ఇక టీ20లు ఆడదు.   అక్టోబర్ 6న నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నది. ఈ నేపథ్యంలో  చివరి టీ20ని విజయంతో ముగించాలని భావిస్తున్నది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ కు రానున్నది. 

ఇప్పటికే సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత జట్టు ఈ మ్యాచ్  ను నామమాత్రపు  మ్యాచ్ గానే పరిగణిస్తున్నది. ఈ మ్యాచ్ లో టాప్-2 ఆటగాళ్లైన  కెఎల్ రాహుల్,విరాట్ కోహ్లీలకు విశ్రాంతినిచ్చారు. అర్ష్‌దీప్ కూడా వెన్నునొప్పి కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.  వీరి స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా జట్టులో  అన్రిచ్ నోర్త్జ్ కు విశ్రాంతినిచ్చిన ఆ జట్టు.. డ్వేన్ ప్రిటోరియస్ ను తుది జట్టులోకి తీసుకుంది.  

తిరువనంతపురంలోని తొలి మ్యాచ్ లో బౌలర్లు పండుగ చేసుకోగా గువహతి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఇక నేటి మ్యాచ్ లో కూడా గువహతి సీన్ రిపీట్ కానున్నట్టు  తెలుస్తున్నది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుందని తెలియడంతో మరోసారి   అభిమానులకు  పండుగే. 

ఆసీస్ తో పాటు  దక్షిణాఫ్రికా సిరీస్ గెలిచిన భారత్ కు టీ20 ప్రపంచకప్ కు ముందునుంచి వేధిస్తున్న  బౌలింగ్ ఆందోళన వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారత బౌలింగ్ నానాటికీ తీసికట్టుగా మారుతున్నది.  బౌలర్లు మారినా డెత్ ఓవర్లలో పరుగుల వరద మాత్రం ఆగడం లేదు. ఈ మ్యాచ్ లో అయినా భారత్ ఆ లోపాన్నిసరిదిద్దుకుంటుందేమో చూడాలి. 

బ్యాటింగ్ లో భారత్ కు  ఆందోళనపరిచే విషయమైతే లేదు. టాప్-4 బ్యాటర్స్  రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు  మంచి టచ్ లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ లో విరాట్, రాహుల్ ఆడకపోవడంతో  బ్యాటింగ్ బాధ్యతలు సూర్యమీద పడనున్నాయి. దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ లు నిరూపించుకోవడానికి మరో అవకాశం. ఇక రాకరాకవచ్చిన అవకాశాన్ని శ్రేయాస్ ఎలా వినియోగించుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరం. 

తుది జట్లు : 

ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్,  దీపక్ చహార్,  ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ 

దక్షిణాఫ్రికా :  టెంబ బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రిలీ రూసో, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహారాజ్, కగిసొ రబాడా, లుంగి ఎంగిడి 

click me!