రోహిత్ శర్మ ముందు సెహ్వాగ్ దిగదుడుపే: షోయబ్ అక్తర్

By telugu teamFirst Published Oct 7, 2019, 4:54 PM IST
Highlights

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో రోహిత్ శర్మ రెండు సెంచరీలు చేశాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ రోహిత్ శర్మను వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చాడు. సెహ్వాగ్ కన్నా రోహిత్ టెక్నిక్ బాగుంటుందని అన్నాడు.

ఇస్లామాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో రోహిత్ శర్మను పోల్చాడు. రోహిత్ శర్మపై షోయబ్ అక్తర్ యూట్యూబ్ చానెల్ లో తన అభిప్రాయాలను వెల్లడించాడు. 

వీరేంద్ర సెహ్వాగ్ టెక్నిక్ కన్నా రోహిత్ శర్మ టెక్నిక్ ఎంతో బాగుంటుందని షోయబ్ అక్తర్ చెప్పాడు. మైదానం అన్ని వైపులా షాట్లు కొట్టాలనే కోరిక, మైండ్ సెట్ మాత్రమే సెహ్వాగ్ కు ఉండేదని ఆయన అన్నాడు. వెరైటీగా, అద్భుతంగా షాట్లు కొట్టడంలో రోహిత్ శర్మ  టైమింగ్ గొప్పగా ఉంటుందని ఆయన అన్నాడు. 

మిగతా ఫార్మాట్లలో రోహిత్ శర్మ స్పెషలిస్టు బ్యాట్స్ మన్ కావాలనే ఉద్దేశంతో టెస్టులపై ఎక్కువగా దృష్టి సారించలేదని, ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చాడని, అతను సెంచరీ సాధించడమే ఆ విషయాన్ని తెలియజేస్తోందని అక్తర్ అన్నాడు.

రోహిత్ శర్మ తొలిసారి టెస్టు మ్యాచులో ఓపెనర్ గా దిగాడు. దక్షిణాఫ్రికాపై జరిగిన తొలి టెస్టు మ్యాచులో రెండు ఇన్నింగ్సులో సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్సులో 176 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 127 పరుగులు చేశాడు. 

పేరుకు ముందు గ్రేట్ అనే అర్థం వచ్చేలా జీ చేర్చుకోవాలని తాను రోహిత్ శర్మకు సూచించానని, భారత్ లో తానే అత్యుత్తమ బ్యాట్స్ మన్ అనేది మెదడులో ఉంచుకుని ఆడాలని కూడా చెప్పానని ఆయన అన్నాడు. 

click me!