
INDvsSA 1st Test: సౌతాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ టాస్ గెలవడం విశేషం. గత 29 ఏళ్లలో సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన భారత జట్టు, ఈ సారి సిరీస్ గెలవడమే లక్ష్యంగా సఫారీ గడ్డపై బరిలో దిగుతోంది.
ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలలో ఎవరికైనా అవకాశం దక్కుతుందని ఆశించినా, సీనియర్ ప్లేయర్ అజింకా రహానేకి మరో అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆరంగ్రేటం చేసి సెంచరీతో అదరగొట్టినా శ్రేయాస్ అయ్యర్‌కి అవకాశం దక్కకపోవడంతో ట్రోల్స్ వస్తున్నాయి...
అయితే వరుసగా ఫెయిల్ అవుతూ, టెస్టు వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోయిన అజింకా రహానేకి ఇది చివరి అవకాశం కావచ్చని టాక్ వినబడుతోంది.
సౌతాఫ్రికాలో ఇప్పటిదాకా భారత జట్టు మూడంటే మూడు టెస్టులు మాత్రమే విజయం సాధించింది. 2006 నుంచి గత మూడు పర్యటనల్లో సౌతాఫ్రికాలో ఒక్కో టెస్టు మ్యాచ్ విజయాన్ని అందుకుంది భారత జట్టు...
2006లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఓ టెస్టు గెలిచిన భారత జట్టు, ఆ తర్వాత 2010లో ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఓ టెస్టు గెలిచింది టీమిండియా. 2013 పర్యటనలో రెండు టెస్టులు మాత్రమే జరగగా, సౌతాఫ్రికా 1-0 తేడాతో సిరీస్ గెలిచింది.
2017-18 పర్యటనలో మొదటి రెండు మ్యాచుల్లో విజయం అంచుల దాకా వచ్చి ఓడిన భారత జట్టు, మూడో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను ముగించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సౌతాఫ్రికాలో ఆడిన ఆఖరి టెస్టు మ్యాచ్ గెలిచిన టీమిండియా, ఈ సారి వరుస విజయాలతో సిరీస్‌ను ప్రారంభించాలని భావిస్తోంది...
రాహుల్ ద్రావిడ్‌కి భారత జట్టు హెడ్ కోచ్‌గా ఇది తొలి విదేశీ పర్యటన కావడంతో టీమిండియా ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ గాయం కారణంగా టీమిండియాకి దూరం కాగా, సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రీచ్ నోకియా కూడా గాయంతో టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
సౌతాఫ్రికాలో ఏడుగురు బ్యాట్స్‌మెన్లలో బరిలో దిగిన క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేసినా... ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్లు, స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవిచంద్రన్ అశ్విన్, పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకున్న టీమిండియా... సీనియర్ బౌలర్లు షమీ, బుమ్రాలతో పాటు సిరాజ్‌కి అవకాశం కల్పించింది.
సౌతాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), అయిడెన్ మార్క్‌రమ్, కేగన్ పీటర్సన్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, తుంబా భువుమా, క్వింటన్ డి కాక్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, లుంగీ ఇంగిడీ
భారత జట్టు: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింకా రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా