చితక్కొట్టిన ఐర్లాండ్ బ్యాటర్లు... 12 ఓవర్లలో టీమిండియా ముందు భారీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Jun 27, 2022, 12:51 AM IST
Highlights

33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసిన హారీ టెక్టర్... ఉమ్రాన్ మాలిక్‌కి ఒకే ఒక్క ఓవర్ ఇచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... టీమిండియా ముందు 12 ఓవర్లలో 105 పరుగుల టార్గెట్.. 

క్రికెట్ పసికూన ఐర్లాండ్‌ రెచ్చిపోయింది. స్వదేశంలో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి పర్యాటక జట్టుకి ఊహించని షాక్ ఇచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌లో చాలా సమయం వృథా కావడంతో తొలి టీ20ని 12 ఓవర్ల మ్యాచ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగుల భారీ స్కోరు చేసింది.

మొదటి ఓవర్‌లోనే ఐర్లాండ్ కెప్టెన్ బాల్బరిన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు భువనేశ్వర్ కుమార్. 2 బంతులాడిన బాల్బరిన్, పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో పాల్ స్టిర్లింగ్‌ని పెవిలియన్ చేర్చాడు హార్ధిక్ పాండ్యా.5 బంతులాడిన పాల్ స్టిర్లింగ్ ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి, దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

డెలనీ 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఐర్లాండ్. ఈ దశలో వికెట్ కీపర్ టక్కర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు హారీ టెక్టర్. 16 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేసిన టక్కర్‌ని యజ్వేంద్ర చాహాల్ అవుట్ చేశాడు. అయితే హారీ టెక్టర్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

ఆరంగ్రేటం మ్యాచ్ ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్‌కి ఒకే ఒక్క ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, ఆ ఓవర్‌లో అతను 14 పరుగులు ఇవ్వడంతో మళ్లీ బౌలింగ్ ఇవ్వకపోవడం విశేషం. ఎక్స్‌ట్రాల రూపంలో మరో 10 పరుగులు ఐర్లాండ్ స్కోరు బోర్డుకు జత చేశారు భారత బౌలర్లు... భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, యజ్వేంద్ర చాహాల్‌లకు తలా ఓ వికెట్ దక్కాయి... 

click me!