INDvsAUS: మళ్లీ సున్నాకే తొలి వికెట్... అయినా మొదటి రోజు మనదే...

By team teluguFirst Published Dec 26, 2020, 12:46 PM IST
Highlights

ఆస్ట్రేలియాను 72.3 ఓవర్లలో 195 పరుగులకి ఆలౌట్ చేసిన భారత బౌలర్లు...

బుమ్రాకి నాలుగు, అశ్విన్‌కి మూడు వికెట్లు...

మొదటి మ్యాచ్‌లోనే 2 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్...

28 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసిన టీమిండియా... 

బాక్సింగ్ డే టెస్టులో మొదటి రోజు పూర్తి ఆధిపత్యం కనబర్చింది అజింకా రహానే సారథ్యంలోని టీమిండియా. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ వంటి సీనియర్ బౌలర్లు లేకుండానే బరిలో దిగిన భారత జట్టు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను 72.3 ఓవర్లలో 195 పరుగులకి ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో లబుషేన్ 48 పరుగులు, ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేశారు.

భారత బౌలర్లు బుమ్రా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీయగా మొదటి మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాకి ఓ వికెట్ దక్కింది. టెస్టు స్పెషలిస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కి మాత్రం వికెట్ దక్కలేదు.

ఆసీస్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశామనే ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. భారత ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లోనే మయాంక్ అగర్వాల్ డకౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆరో బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు మయాంక్ అగర్వాల్. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కి ఇదే మొట్టమొదటి డకౌట్.

మొదటి టెస్టు ఆడుతున్న శుబ్‌మన్ గిల్... బౌండరీతో స్కోరు ఖాతా తెరిచాడు. 38 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌తో పాటు ఛతేశ్వర్ పూజారా 23 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఆసీస్ స్కోరుకి ఇంకా 159 పరుగులు వెనకబడి ఉంది టీమిండియా. మొదటి రోజు ఆట ముగిసేసమయానికి 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది భారత జట్టు.

click me!