తిరువనంతపురంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. భారత ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ( 58), యశస్వి జైస్వాల్ (53)తో పాటు ఇషాన్ కిషన్ (52) పరుగులు చేశారు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం తిరువనంతపురంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. క్రీజులోకి అడుగుపెట్టిన భారత ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ( 58), యశస్వి జైస్వాల్ (53)లు శుభారంభం అందించారు. వీరిద్దరూ ఫోర్లు , సిక్కర్లతో గ్రౌండ్‌ను మోత మోగించారు. ముఖ్యంగా యశస్వి అయితే ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. అబాట్ వేసిన నాలుగో ఓవర్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు .. నాథన్ వేసిన ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టి విధ్వంసం సృష్టించాడు. కేవలం 24 బంతుల్లోనే యశస్వి అర్ధ శతకం పూర్తి చేశాడు.
ఈ జంట తొలి వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. నాథన్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి స్లిప్స్‌లో ఆడమ్ జంపాకు క్యాచ్ ఇచ్చి యశస్వి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషాన్ (52) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత 22 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేసిన ఇషాన్.. తర్వాత కేవలం 9 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. కానీ ఆ కాసేపటికే స్టోయినిస్ వేసిన 16 ఓవర్ రెండో బతికి నాథన్ ఎలిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. చివరిలో సూర్యకుమార్ యాదవ్ (19), రింకూ సింగ్ (31) కూడా ధాటిగా ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎలిస్ 3 , స్టోయినిస్ ఒక వికెట్ పడగొట్టారు.