కార్తీక్ అందుకే కెప్టెన్సీ వదిలేశాడు.. మోర్గాన్

By telugu news teamFirst Published Oct 17, 2020, 1:09 PM IST
Highlights

బ్యాటింగ్‌పరంగా కూడా దినేష్ కార్తీక్ ఈ సీజన్‌లో అంత ఫామ్‌లో లేకపోవడం నిరాశపరిచే అంశం. కెప్టెన్సీ నుంచి డీకేను తప్పించాలని భావించడానికి ఇదే ప్రధాన కారణంగా తెలిసింది.

ఐపీఎల్ లో నిన్న ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎల్ జట్లలో ఒకటైన కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి  దినేష్ కార్తీక్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం. దినేష్ కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. ఆ బాధ్యతను మోర్గాన్ స్వీకరించారు. ఈ మార్పుకు సంబంధించిన నిర్ణయాన్ని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలు శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. 

దినేష్ కార్తీక్ కెప్టెన్సీలో ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన నైట్‌రైడర్స్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే.. డీకే కెప్టెన్సీపై ఇటీవల తీవ్ర విమర్శలొచ్చాయి. ఓడిపోయిన ఆ మూడు మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతలను డీకే సరిగ్గా నిర్వర్తించకపోవడమే కారణమన్న విమర్శలూ వినిపించాయి. బ్యాటింగ్‌పరంగా కూడా దినేష్ కార్తీక్ ఈ సీజన్‌లో అంత ఫామ్‌లో లేకపోవడం నిరాశపరిచే అంశం. కెప్టెన్సీ నుంచి డీకేను తప్పించాలని భావించడానికి ఇదే ప్రధాన కారణంగా తెలిసింది.

కాగా.. దినేష్ కార్టీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పట్ల తాజాగా కొత్త కెప్టెన్ మోర్గాన్ స్పందించాడు. జట్టు మేలు కోసమే కార్తీక్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడని మోర్గాన్ పేర్కొన్నాడు. నిస్వార్థంతో కార్తీక్ అలా చేశాడని చెప్పాడు. 

‘ నిన్న(గురువారం)నే కెప్టెన్సీ మార్పుపై చర్చ జరిగింది. కార్తీక్‌ నా వద్దకు వచ్చాడు. అప్పుడు కోచ్‌లు కూడా అక్కడే ఉన్నారు. నేను కెప్టెన్సీ పదవి నుంచి వైదొలుగుతానని కార్తీక్‌ చెప్పాడు.  బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయాలనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్లు నాతో చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతలతో బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయలేకపోతున్నానని అందుకే తప్పుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అది జట్టు కూడా మంచిదని వివరించాడు. కార్తీక్‌ నిస్వార్థంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి’అంటూ మోర్గాన్ పేర్కొన్నాడు.

 కాగా.. ఈ ఐపీఎల్ సీజన్‌లో దినేష్ కార్తీక్  ఇప్పటివరకూ 108 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. 2018 నుంచి కేకేఆర్ జట్టు కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ వ్యవహరిస్తున్నాడు. కార్తీక్ నాయకత్వంలో 2018లో నైట్‌రైడర్స్ జట్టు ప్లే ఆఫ్ వరకూ వెళ్లగా.. 2019లో లీగ్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. రెండున్నర సంవత్సరాలుగా కేకేఆర్ జట్టుకు డీకే కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక.. మోర్గాన్ కూడా కెప్టెన్సీకి అన్ని విధాలా అర్హుడే. 2019 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌గా మోర్గాన్‌కు మంచి పేరుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నైట్‌రైడర్స్ జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌ జట్టుతో నైట్‌రైడర్స్ టీం తలపడనుంది.
 

click me!