Virat Kohli: దిగుతావా.. దించేయమంటావా? టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పకముందే కోహ్లికి బీసీసీఐ అల్టిమేటం..!

By Srinivas MFirst Published Jan 21, 2022, 12:43 PM IST
Highlights

BCCI Vs Virat Kohli: దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు  నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విరాట్ కోహ్లి  చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారని తెలుస్తున్నది. ఆ వ్యాఖ్యల కారణంగానే ఇప్పుడు... 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మధ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు  విరాట్ వన్డే కెప్టెన్సీపై వేటు వేసిన బీసీసీఐ.. ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పజెప్పింది.  ఈ విషయమై భారత క్రికెట్ లో మొదలైన చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు  నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విరాట్ కోహ్లి  చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారని తెలుస్తున్నది. ఆ వ్యాఖ్యల కారణంగానే కోహ్లి.. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 

తాజాగా ప్రముఖ  స్పోర్ట్స్ వెబ్సైట్ ఇన్సైడ్ స్పోర్ట్స్ కథనం ప్రకారం... దక్షిణాఫ్రికా తో టెస్టు సిరీస్ తర్వాత కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ భావించిందట. బీసీసీఐలోని పెద్దలు ఈ మేరకు బోర్డు ముందు ఓ ప్రతిపాదన కూడా పెట్టారట.. ఒకవేళ ఈ సిరీస్ తర్వాత కోహ్లి స్వచ్ఛందంగా కెప్టెన్సీ పదవి నుంచి వైదొలగకుంటే అతడిపై వేటు వేయడానికి కూడా బీసీసీఐ వెనుకాడలేదని తెలుస్తున్నది. 

ఇదే విషయమై బోర్డులోని ఓ అధికరి మాట్లాడుతూ.. ‘అవును.. ఆ ఆప్షన్ (కోహ్లిపై వేటు) కూడా మా చర్చలోకి వచ్చింది. సౌతాఫ్రికా సిరీస్ తర్వాత అతడిని కెప్టెన్సీ నుంచి వైదొలగాలని మేం చర్చించుకున్నాం. అయితే దీనిపై సభ్యులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేదు. కానీ  మెజారిటీ సభ్యుల అభిప్రాయమేమిటంటే.. భారత జట్టుకు స్ప్లిట్ కెప్టెన్సీ (వన్డేలు, టెస్టులకు  కెప్టెన్లు) అనేది మంచిది కాదు. ఒకవేళ కోహ్లి  దిగిపోకుంటే  అతడిని దిగిపోమని అడగాలని అనుకున్నాం..’ అని తెలిపాడు. 

 

Ganguly told that seriously on that day after virat kohli interview itseems🧐 pic.twitter.com/xara8fdRfF

— MaayoN ᴮᵉᵃˢᵗ 😎🎩💫 (@itz_satheesh)

కాగా.. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ముగిశాక మరుసటి రోజు కోహ్లి తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని  ప్రకటించిన విషయం  విదితమే.  సిరీస్ కోల్పోవడంతో కోహ్లి ఇలా చేశాడని అప్పట్లో వ్యాఖ్యలు  వినిపించినా.. తాజాగా వెలుగులోకి వస్తున్న వార్తలను బట్టి  కోహ్లి వైదొలగడానికి  మరేవో కారణాలు ఉన్నాయని అవగతమవుతున్నది. 

దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు పాత్రికేయుల సమావేశంలో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మీద అతడు  చేసిన వ్యాఖ్యలే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టమవుతున్నది.  గతేడాది టీమిండియా టీ20 బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లికి తాను స్వయంగా ఫోన్ చేసినా.. బోర్డు కూడా చెప్పినా వినిపించకుండా అతడు తప్పుకున్నాడని గతంలో గంగూలీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దానిని ఊటంకిస్తూ కోహ్లి.. తననెవరూ సంప్రదించలేదని, అసలు అలాంటిదేమీ జరుగలేదని, దీనిపై గంగూలీనే స్పష్టత కోరాలని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. అయితే కోహ్లి మీడియాతో మాట్లాడిన మాటలతో బీసీసీఐ తక్షణమే చర్యలు తీసుకుంటుందని భావించినా అప్పటికే రగులుతున్న  వన్డే కెప్టెన్సీ వివాదంతో  సహనంగా ఉంది. కోహ్లి చేసిన వ్యాఖ్యలపై గంగూలీ షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వాలనుకున్నాడని కూడా  వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 
 

click me!