మీకంత కష్టంగా ఉంటే నేను కూడా అక్కడికి రాను..! క్రికెట్ ఆస్ట్రేలియాకు అఫ్గాన్ స్పిన్నర్ షాక్

By Srinivas MFirst Published Jan 13, 2023, 12:11 PM IST
Highlights

మార్చిలో   అఫ్గానిస్తాన్ పర్యటనకు వెళ్లవలసి ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా తన నిర్ణయాన్ని మార్చుకుంది.  ఈ సిరీస్ కు తాము అఫ్గాన్ వెళ్లబోవడం లేదని ఇటీవలే ప్రకటించింది. 

క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై అఫ్గానిస్తాన్ క్రికెట్ షాక్ కు గురైంది.  మార్చిలో మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు.. అఫ్గాన్ కు వెళ్లాల్సి ఉంది. అయితే  ఆఫ్గన్ లో మహిళలు, అమ్మాయిల  ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా  తాలిబన్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో దానికి  నిరసనగా తాము  వన్డే సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్టు  పేర్కొంది.   

అయితే ఆసీస్ నిర్ణయంపై   ఆఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్రంగా స్పందించాడు.  ఆసీస్ జట్టు తమ దేశం రావడానికి అంతగా ఇబ్బందిపడితే తాను కూడా   ఆసీస్ లో ఆడాలా..? వద్దా..? అన్న విషయమై   పునరాలోచన చేయాల్సి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియాను హెచ్చరించాడు. 

రషీద్ ఖాన్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.   ఆసీస్ ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత  రషీద్ ట్విటర్ లో స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా క్రికెట్ తీసుకున్న నిర్ణయం  నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది.  నా దేశం తరఫున క్రికెట్ ఆడటాన్ని నేను  గౌరవంగా భావిస్తాను.  కానీ ఆస్ట్రేలియా నిర్ణయం  మా క్రికెట్ ను తిరోగమనం దిశకు పడేసింది. ఆఫ్గాన్ లో ఆడటం  ఆస్ట్రేలియాకు అంత అసౌకర్యంగా ఉంటే  నేను కూడా బిగ్ బాష్ లీగ్ లో ఆడాలా..? లేదా..? అనేదానిమీద నిర్ణయం తీసుకోవాలి.    ఈ విషయంలో కాస్త కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది..’ అని పేర్కొన్నాడు. తమ దేశానికి ఉన్న ఏకైక ఆశాకిరణం  క్రికెట్ మాత్రమేనని, దానిని రాజకీయాలకు ముడిపెట్టొద్దని రషీధ్ ఖాన్  తన ట్వీట్ లో కోరాడు. మరి రషీద్ ఖాన్ వ్యాఖ్యలపై బీబీఎల్, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. 

Cricket! The only hope for the country.
Keep politics out of it. ♥️ 🇦🇫 ♥️ pic.twitter.com/ZPpvOBetPJ

— Rashid Khan (@rashidkhan_19)

ఇదిలాఉండగా ఆసీస్ నిర్ణయంపై అఫ్గాన్ క్రికెట్ కూడా  విచారం వ్యక్తం చేసింది.  ‘క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం  విషాదకరం. ఇది మేము ఊహించలేదు.  ఈ నిర్ణయం మా పై కచ్చితంగా ప్రభావం చూపుతుంది..’అని  ఓ ప్రకటనలో పేర్కొంది. 

click me!