ముగిసిన మూడో రోజు ఆట... 300 ఆధిక్యానికి చేరువలో ఆస్ట్రేలియా! అద్భుతం జరిగితే కానీ...

By Chinthakindhi RamuFirst Published Jun 9, 2023, 10:45 PM IST
Highlights

మూడో రోజు ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగుల స్కోరు చేసిన ఆస్ట్రేలియా... ఇప్పటికే 296 పరుగుల భారీ ఆధిక్యంలో ఆసీస్... కీలకంగా నాలుగో రోజు తొలి సెషన్.. 

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా, 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగుల స్కోరు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 173 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆస్ట్రేలియా ప్రస్తుతం 296 పరుగుల తిరుగులేని ఆధిక్యంలో ఉంది..

రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్లను త్వరగా కోల్పోయింది. 8 బంతుల్లో 1 పరుగు చేసిన డేవిడ్ వార్నర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..

ఉమేశ్ యాదవ్‌కి ఈ మ్యాచ్‌లో ఇదే తొలి వికెట్. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 47 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

27 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ బౌలింగ్‌లోనే అవుట్ కావడం విశేషం..

111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. మార్నస్ లబుషేన్ 118 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు, కామెరూన్ గ్రీన్ 27 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరినీ నాలుగో రోజు త్వరగా అవుట్ చేసినా ఆ తర్వాత అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ కూడా బ్యాటింగ్ చేయగలరు..

చూస్తుంటే ఆస్ట్రేలియా ఈజీగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకి 400 పరుగుల టార్గెట్ పెట్టేలా కనిపిస్తోంది. అదే జరిగితే టీమిండియా బ్యాటర్లపై కొండంత భారం పెట్టినట్టు అవుతుంది. 

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 151/5 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శ్రీకర్ భరత్‌, మొదటి సెషన్ రెండో బంతికే అవుట్ అయ్యాడు. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ కలిసి ఏడో వికెట్‌కి 109 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకున్నారు..

వీరిద్దరి భాగస్వామ్యం కారణంగా మూడో రోజు మొదటి సెషన్‌లో ఒక్క వికెట్ కోల్పోయి 107 పరుగులు చేసిన భారత జట్టు, పూర్తి డామినేషన్ కనబర్చింది. అయితే 89 పరుగులు చేసి సెంచరీ వైపు సాగుతున్న అజింకా రహానే, లంచ్ బ్రేక్ తర్వాత అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ఉమేశ్ యాదవ్ వికెట్ కూడా కోల్పోయింది టీమిండియా...

51 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, ఓవల్‌లో వరుసగా మూడో 50+ స్కోరు నమోదు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. శార్దూల్ ఠాకూర్ అవుటైన వెంటనే మహ్మద్ షమీ కూడా పెవిలియన్ చేరడంతో 300 మార్కుకి 4 పరుగుల దూరంలో ఆగిపోయింది భారత జట్టు. తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకి 173 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. 

click me!