ICC World cup 2023: ముంబైలో టీమిండియా ఊర మాస్ బ్యాటింగ్! కోహ్లీ రికార్డు ‘50’, శ్రేయాస్ సూపర్ సెంచరీతో..

By Chinthakindhi Ramu  |  First Published Nov 15, 2023, 5:52 PM IST

వన్డేల్లో 50వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ... వరల్డ్ కప్‌లో శ్రేయాస్ అయ్యర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు... రోహిత్, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ మెరుపులతో.. 


ముంబైలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టు బౌండరీల మోత మోగించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగుల భారీ స్కోరు చేసింది..

 రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో 8 ఓవర్లలోనే 71 పరుగులు చేసింది భారత జట్టు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ, టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

Latest Videos

undefined

ఆ తర్వాత శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 94 పరుగులు జోడించారు. 65 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, తొడ కండరాలు పట్టేయడంతో నడవలేక రిటైర్డ్ హాట్‌గా పెవిలియన్ చేరాడు..

శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ కలిసి 163 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ దశలో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును, 2003 వన్డే వరల్డ్ కప్‌లో 673 పరుగుల రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ... 104 బంతుల్లో వన్డేల్లో 50వ సెంచరీ అందుకున్నాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 117 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టిమ్ సౌథీ బౌలింగ్‌లో డివాన్ కాన్వేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

మరో ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ 67 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2007 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 72 బంతుల్లో సెంచరీ అందుకోగా ఆ రికార్డును శ్రేయాస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్‌కి వరుసగా ఇది రెండో సెంచరీ.

70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 105 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ వస్తూనే భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. రిటైర్ట్ హార్ట్‌గా పెవిలియన్ చేరిన శుబ్‌మన్ గిల్, ఆఖరి ఓవర్‌లో తిరిగి బ్యాటింగ్‌కి వచ్చాడు. 

శుబ్‌మన్ గిల్ 66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్‌గా నిలవగా కెఎల్ రాహుల్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

click me!