ICC World cup 2023: మరోసారి తేలిపోయిన పాక్ బౌలర్లు... రికార్డు స్కోరు చేసిన న్యూజిలాండ్...

By Chinthakindhi Ramu  |  First Published Nov 4, 2023, 2:57 PM IST

New Zealand vs Pakistan: నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగుల రికార్డు స్కోరు చేసిన న్యూజిలాండ్... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మూడో సెంచరీ చేసిన రచిన్ రవీంద్ర..


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సెమీస్ ఛాన్స్‌లు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు తేలిపోయారు. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగుల రికార్డు స్కోరు చేసింది...

వన్డే వరల్డ్ కప్ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్‌కి ఇదే అత్యధిక స్కోరు. డివాన్ కాన్వే 39 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేయగా రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ కలిసి రెండో వికెట్‌కి 180 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

Latest Videos

undefined

గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన కేన్ విలియంసన్ 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు చేసి, సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. 94 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 108 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర, 2023 వన్డే వరల్డ్ కప్‌లో మూడో సెంచరీ బాదాడు..

వన్డే వరల్డ్ కప్‌ ఒకే ఎడిషన్‌లో 3 సెంచరీలు చేసిన మొదటి న్యూజిలాండ్‌ ప్లేయర్‌గా నిలిచిన రచిన్ రవీంద్ర, సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ చేశాడు. 23 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ 2 సెంచరీలు చేయగా, రచిన్ రవీంద్ర మూడో సెంచరీతో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు..


18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన డార్ల్ మిచెల్‌ని హారీస్ రౌఫ్ అవుట్ చేయగా మార్క్ ఛాప్‌మన్ 27 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేయగా 2 సిక్సర్లు బాదిన మిచెల్ సాంట్నర్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు..

ఎక్స్‌ట్రాల రూపంలో మరో 26 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన షాహీన్ షా ఆఫ్రిదీ, వికెట్ల తీయలేకపోగా 90 పరుగులు సమర్పించాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన పాక్ బౌలర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు షాహీన్ ఆఫ్రిదీ. మహ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు తీయగా హసన్ ఆలీ, ఇఫ్తికర్ అహ్మద్, హారీస్ రౌఫ్ తలా ఓ వికెట్ తీశారు.. 

ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ కూడా సెమీ ఫైనల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంటాయి.

click me!