రచిన్ రవీంద్ర వీరోచిత సెంచరీ... ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన థ్రిల్లర్‌లో పోరాడి ఓడిన కివీస్...

By Chinthakindhi Ramu  |  First Published Oct 28, 2023, 6:30 PM IST

New Zealand vs Australia: 116 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర... జేమ్స్ నీశమ్ పోరాటంతో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన ఉత్కంఠ.. 


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌‌లా సాగి, అసలు సిసలు వన్డే మ్యాచ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించింది. ఆఖరి ఓవర్, ఆఖరి బంతి వరకూ సాగిన హై డ్రామాలో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.  

డివాన్ కాన్వే, విల్ యంగ్ కలిసి తొలి వికెట్‌కి 7.1 ఓవర్లలో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  డివాన్ కాన్వే 17 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేయగా విల్ యంగ్ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేశాడు. ఈ ఇద్దరినీ జోష్ హజల్‌వుడ్ అవుట్ చేశాడు..

Latest Videos

రచిన్ రవీంద్ర- డార్ల్ మిచెల్ కలిసి మూడో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 51 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన డార్ల్ మిచెల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌ని కూడా ఆడమ్ జంపా పెవిలియన్ చేరాడు..

గ్లెన్ ఫిలిప్స్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన రచిన్ రవీంద్ర 89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 116 పరుగులు చేసి... 2023 వరల్డ్ కప్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు..

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 123 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర, నెదర్లాండ్స్‌పై 51, ఆఫ్ఘాన్‌పై 32, ఇండియాతో మ్యాచ్‌లో 75 పరుగులు చేశాడు. మొత్తంగా 406 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర, 23 ఏళ్ల వయసులో వరల్డ్ కప్‌లో 400+ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. రచిన్ కంటే ముందు 1996లో సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ సాధించాడు..

రచిన్ రవీంద్రను ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేసే సమయానికి ఆస్ట్రేలియా విజయానికి 95 పరుగులు కావాలి. మిచెల్ సాంట్నర్ 12 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఓ ఫోర్ బాదిన మ్యాట్ హెన్రీ, ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు. హెన్రీ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ విజయానికి 20 బంతుల్లో 43 పరుగులు కావాలి..

మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో మొదటి బంతికి సిక్సర్ బాదిన జేమ్స్ నీశమ్ 11 పరుగులు రాబట్టాడు. హజల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో ట్రెంట్ బౌల్డ్ సిక్సర్, జేమ్స్ నీశమ్ ఫోర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి రెండు బంతుల్లో హజల్‌వుడ్ పరుగులేమీ ఇవ్వకపోవడంతో చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సి వచ్చాయి. 

మొదటి బంతికి ట్రెంట్ బౌల్ట్ సింగిల్ తీయగా తర్వాతి బంతికి వైడ్స్ రూపంలో 5 పరుగులు వచ్చాయి. రెండో బంతికి 2 పరుగులు తీయగా మూడో బంతికి కూడా 2 పరుగులు వచ్చాయి. చివరి 3 బంతుల్లో 9 పరుగులు కావాల్సి వచ్చాయి. నాలుగో బంతికి కూడా 2 పరుగులు రాగా ఐదో బంతికి రెండో పరుగు కోసం ప్రయత్నించిన జేమ్స్ నీశమ్ రనౌట్ అయ్యాడు. దీంతో చివరి బంతికి న్యూజిలాండ్ విజయానికి 6 పరుగులు కావాల్సి వచ్చాయి.. ఆఖరి బంతికి లూకీ ఫర్గూసన్ పరుగులేమీ తీయలేకపోవడంతో ఆస్ట్రేలియాకి 5 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ దక్కింది. 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసిన జేమ్స్ నీశమ్ పోరాడినా... కివీస్‌కి విజయాన్ని అందించలేకపోయాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ కలిసి ఆస్ట్రేలియాకి మెరుపు ఆరంభం అందించారు.65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, సెంచరీతో ఘనమైన రీఎంట్రీ ఇచ్చాడు. 

మిచెల్ మార్ష్ 36, స్టీవ్ స్మిత్ 18, మార్నస్ లబుషేన్ 18, గ్లెన్ మ్యాక్స్‌వెల్  41 పరుగులు ,జోష్ ఇంగ్లీష్  38 పరుగులు, ప్యాట్ కమ్మిన్స్ 37 పరుగులు చేశారు. 387/6 స్కోరుతో ఉన్న ఆస్ట్రేలియా ఒక్క పరుగు తేడాలో 4 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్.. ఒకే ఓవర్‌లో జోష్ ఇంగ్లీష్, ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపాలను అవుట్ చేశాడు.

click me!