క్వింటన్ డి కాక్ మరో సెంచరీ... ఆఖరి వన్డే ప్రపంచ కప్‌లో అదరగొడుతున్న సఫారీ బ్యాటర్..

By Chinthakindhi Ramu  |  First Published Oct 24, 2023, 4:50 PM IST

2023 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో మూడో సెంచరీ బాదిన క్వింటన్ డి కాక్‌... బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా... 


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు క్వింటన్ డి కాక్. టీ20లకు, ఫ్రాంఛైజీ క్రికెట్‌కి అందుబాటులో ఉండేందుకు వీలుగా 50 ఓవర్ల క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చాడు..

ఆఖరి వన్డే ప్రపంచ కప్ టోర్నీలో క్వింటన్ డి కాక్ అదిరిపోయే బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు క్వింటన్ డి కాక్. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 106 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 109 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు..

Latest Videos

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఫెయిలైన క్వింటన్ డి కాక్, తాజాగా ముంబైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో సెంచరీ నమోదు చేశాడు. రీజా హెండ్రిక్స్ 12, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 1 పరుగు చేసి అవుట్ కావడంతో 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా..

ఈ దశలో క్వింటన్ డి కాక్, అయిడిన్ మార్క్‌రమ్‌తో కలిసి మూడో వికెట్‌కి 131 పరుగులు జోడించారు. అయిడిన్ మార్క్‌రమ్ 69 బంతుల్లో 7 ఫోర్లతో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. క్వింటన్ డి కాక్ 101 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.

2023 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో క్వింటన్ డి కాక్‌కి ఇది మూడో సెంచరీ. 

click me!