వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మూడు మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చిన అహ్మదాబాద్... మూడింట్లోనే ఛేజింగ్ చేసిన జట్లకే విజయాలు! ఫైనల్‌లో మాత్రం ఛేజింగ్ కష్టమంటున్న పిచ్ రిపోర్ట్..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా భారత జట్టు, ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం తయారుచేసిన పిచ్ రిపోర్ట్ వచ్చేసింది.. అహ్మదాబాద్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ 282 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 36.2 ఓవర్లలోనే ఛేదించింది న్యూజిలాండ్..
ఆ తర్వాత ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇదే వేదికలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని 30.3 ఓవర్లలో ఛేదించింది భారత జట్టు..
ఆఖరిగా ఆఫ్ఘాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో ఛేదించింది సౌతాఫ్రికా. ఇక్కడ జరిగిన గత మూడు మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్లకే విజయం దక్కింది. అయితే ఇండియా- ఆస్ట్రేలియా పిచ్ రిపోర్ట్ మాత్రం మరోలా ఉంది..
‘తొలుత బ్యాటింగ్ చేసి 315-320 పరుగులు చేస్తే, ఈజీగా డిఫెండ్ చేసుకోవచ్చు. రెండోసారి బ్యాటింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. నల్ల మట్టి నేలపైన హెవీ రోలర్‌ని వాడారు. కాబట్టి పిచ్ బ్యాటింగ్‌కి సహకరిస్తున్నట్టే అనిపించినా మెల్లిమెల్లిగా బౌలర్లకు అనుకూలిస్తుంది.. తొలుత బ్యాటింగ్ చేసి 300 దాటితే, ఆ టార్గెట్‌ని ఛేదించడం చాలా కష్టమవుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ చీఫ్ గ్రౌండ్ స్టాఫ్ ఆశీష్ భూమిక్..
2023 వన్డే వరల్డ్ కప్‌లో మొదటి 5 మ్యాచుల్లో ఛేజింగ్ విజయాలు అందుకున్న భారత జట్టు, ఆ తర్వాత వరుసగా 5 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసి విజయాలు అందుకుంది... చూస్తుంటే ఫైనల్‌లో టాస్ గెలవడం కూడా టీమిండియాకి ముఖ్యంగా మారే అవకాశం ఉంది.